ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ మంజూరు

 

ఎన్నికలకు ముందు హడావుడిగా రాష్ట్ర విభజన చేసేసిన యూపీయే ప్రభుత్వం, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కూడా ప్రకటించేసింది. “అయినా తను ఎన్నికలలో గెలిచినప్పుడు సంగతి కదా...అప్పుడు చూసుకొందాములే...”అనుకొందేమో తెలియదు గానీ దాని సాధ్యాసాధ్యాల గురించి మాత్రం ఆలోచించనట్లు లేదు. కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానని చెపుతున్నప్పుడు మేము ఇవ్వలేమని చెపితే ఓట్లు రాలవని భావించిందో ఏమో..తెలియదు గానీ “మేము కూడా ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని బీజేపీ కూడా వంత పాడింది. పైగా “మేమే కాంగ్రెస్ చెవి మెలేసి ప్రత్యేక హోదా ఇస్తామని దాని చేత ఒట్టేయించామని” బాకా ఊదుకొన్నారు కూడా. కానీ ఎనిమిది నెలలు ప్రత్యేకం అంటూ ఊరించిన తరువాత, ‘పొరుగు రాష్ట్రాలు అభ్యంతరం చెపుతున్నాయి. మరో అరడజను రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం బృంద గానం చేస్తున్నాయి. పైగా అన్ని రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు ఒకే చేసే పరిస్థితి కూడా లేదు. అందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేమని’ ఎన్డీయే ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీలా హ్యాండ్ ఇవ్వకుండా అందుకు బదులుగా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేందుకు అంగీకరించింది.

 

చంద్రబాబు నాయుడు ఒత్తిడి కారణంగా కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులతో గత మూడు రోజులుగా చర్చించిన తరువాత రాష్ట్రానికి మూడు ప్రత్యేక ప్యాకేజీలు ఆమోదించారు.

 

వాటిలో మొదటిది: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ జిల్లాలలో పారిశ్రామిక అభివృద్ధి కోసం వచ్చే బడ్జెట్టులో వెయ్యి కోట్ల మూలధనంతో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి నిధి (ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఫండ్)ని ఏర్పాటు చేస్తుంది. దానిలో దేశంలో పెద్ద పెద్ద పరిశ్రమలను, వ్యాపార సంస్థలను పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రోత్సహిస్తుంది. ఆ నిధులను రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలలో పరిశ్రమల అభివృద్ధికి వినియోగిస్తారు.

 

రెండవ ప్యాకేజీలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకి 3 శాతం పన్ను రాయితీ ఇస్తుంది. దానిని కేంద్రమే పూర్తిగా భరిస్తుంది.

 

మూడవ ప్యాకేజీలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకి ‘క్యాపిటల్ అలవెన్స్’ రూపంలో ఆదాయపన్నులో రాయితీ ఇస్తుంది.

 

ఈ మూడు ప్యాకేజీలకు ఆర్ధికమంత్రి ఆమోదముద్ర వేశారు. కనుక వారం పదిరోజుల్లోనే అధికారికంగా ప్రకటిస్తుందని ఆర్దికమంత్రితో చర్చించిన రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసి ఉండి ఉంటే ఇంకా మంచి ప్యాకేజీ లభించి ఉండేది. కానీ అది సాధ్యం కాదని తేలిపోయింది కనుక ఈ మూడు ప్యాకేజీలతో సర్దుకోక తప్పదు. ఇప్పటికయినా ఈ అంశంపై స్పష్టత వచ్చింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అనేక రాయితీలు, ప్రోత్సహకాలు ప్రకటించింది కనుక ఇకపై రాష్ట్రానికి అనేక కొత్త పరిశ్రమలు రావచ్చును.

 

విభజన చట్టం ప్రకారం రూ.16,000 కోట్ల రాష్ట్ర ఆర్ధిక లోటును పూడ్చేందుకు కేంద్రం నిధులు విడుదల చేయవలసి ఉంది. కానీ దానికి బదులు ‘ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ యండ్ బడ్జెట్ మేనేజిమెంట్’ చట్టాన్ని సవరించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దేశ విదేశాలలో సంస్థల నుండి భారీగా రుణాలు తీసుకొనే వెసులుబాటు కల్పించాలని నిశ్చయించింది. ప్రస్తుతం రాష్ట్ర జీ.డీ.పీ.లో మూడు శాతం వరకు రుణాలు తీసుకొనే వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ చెప్పారు.