పరిపాలనలో ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రుల ప్రత్యేక ముద్రలు




ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు రెండూ పరిపాలనలో ప్రత్యేక పంధాను అనుసరిస్తున్నాయి. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పాలనలో ప్రభుత్వంపై అది తలపెట్టే ప్రతీ కార్యక్రమాలు, పధకాలలో స్పష్టమయిన తెలంగాణా ముద్ర కనబడాలని ఆరాటపడుతున్నారు. తెలంగాణా ప్రభుత్వ రాజముద్రలో యావత్ దేశానికి సుపరిచితమయిన చార్మినార్ బొమ్మను ముద్రించడం, తెలంగాణ సంస్కృతి ఆచారాలకు అద్దంపట్టే బ్రతుకమ్మ, బోనాలు పండుగలను అధికారిక పండుగలుగా ప్రకటించడం, గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం వంటివి అందుకు చక్కటి ఉదాహరణలు.

 

తెలంగాణా చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు, తెలంగాణా కవులు, రచయితలు వగైరాలను వచ్చే ఏడాది నుండి పిల్లల పాట్యంశాలలో చేర్చేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఇక తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఫీజు రీ ఇంబర్స్ మెంటు చేయాలనే కేసీఆర్ ఆలోచన ఆయనలో తెలంగాణావాదానికి మరో మంచి ఉదాహరణ. ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా జరుగుతున్న సర్వే కూడా తెలంగాణా ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో చేస్తున్నదేనని ఆయనే స్వయంగా ప్రకటించారు.

 

ఈవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రతీ నిర్ణయంలో, కార్యక్రమంలో తెలంగాణా ముద్ర స్పష్టంగా కనబడాలని తపిస్తుంటే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ అడుగు అభివృద్ధి పధం వైపే పడాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఆయన తన మంత్రులందరికీ పూర్తి స్వేచ్చనిచ్చి వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును, తద్వారా ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచి అందరినీ రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకొనేలా గట్టిగా కృషి చేస్తున్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్చనిచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు వారి పనితీరును సమీక్షిస్తూ వారిని మరింత అప్రమత్తంగా ఉండేలా చేస్తున్నారు.

 

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చెప్పట్టక మునుపు, తరువాత కూడా ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రులందరినీ స్వయంగా కలిసి రాష్ట్ర సమస్యల గురించి వివరించి వారి సహకారం కోరారు. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఉదారంగా అంగీకరించి రాష్ట్రానికి అనేక పధకాలను, పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. రాష్ట్రాభివృద్ధికి అవసరమయిన నిధులు, పధకాలు, ప్రాజెక్టుల మంజూరు వంటి పనులను చక్కబెట్టేందుకు కంబంపాటి రామ్మోహన్ రావును డిల్లీలో రాష్ట్రప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమించారు. అదేవిధంగా రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, యంపీల ద్వారా కేంద్రంపై నిరంతరం ఒత్తిడి చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను రప్పించేందుకు, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆయన కృషి, ప్రయత్నాల యొక్క ఫలితాలు క్రమంగా ప్రస్పుటంగా కనబడటం మొదలవుతుంది. ఉదాహరణకు చంద్రబాబు ప్రభుత్వం కృషి కారణంగానే ఇంతవరకు తీవ్ర విద్యుత్ కొరతతో, కోతలతో సతమతమవుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఆ సమస్యల నుండి క్రమంగా బయటపడుతోంది.బహుశః త్వరలోనే చంద్రబాబు నాయుడు పాలన పూర్తి వేగం పుంజుకొని, రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున మొదలవవచ్చును.