ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు సహకరించుకొన్నాయోచ్

 

 ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య కీచులాటలు నిత్యకృత్యం అయిపోయిన ఈ తరుణంలో రెంటి మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడటం చాలా కష్టమనిపిస్తోంది. కానీ బేషజాలు పక్కనబెట్టి కాసింత విజ్ఞతతో వ్యవహరిస్తే సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవడమేమీ కష్టం కాదని చెప్పేందుకు రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చును. రెండు ప్రభుత్వాల శాసనసభ స్పీకర్లు చర్చించుకొని, సభా సమావేశాల తేదీలు, చాంబర్ల కేటాయింపులు వంటి సమస్యలను చాలా సామరస్యంగా పరిష్కరించుకొన్నారు.

 

అదేవిధంగా తీవ్ర విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతున్న తెలంగాణా ప్రభుత్వం అభ్యర్ధన మేరకు, శ్రీశైలం ఎడమవైపు తెలంగాణకు చెందిన హైడల్ ప్రాజెక్టుకు ఆంద్ర ప్రభుత్వం నీళ్ళు విడుదల చేసింది. ఆ నీటితో దాదాపు 8.16 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగడంతో తెలంగాణా రాష్ట్రానికి కొంతలో కొంత ఉపశమనం లభించింది. నిజానికి డ్యాములో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు చేరేవరకు ఆంద్రప్రభుత్వం నీళ్ళు విడుదల చేయనవసరం లేదు. కానీ తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్, ఆంద్ర ఇంజినీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావుల మధ్య సహృద్భావ వాతావరణంలో జరిగిన చర్చల కారణంగా డ్యాములో 854 అడుగుల నీటి మట్టం ఉన్నపుడే ఆంద్ర ప్రభుత్వం నీలు విడుదల చేసి, తెలంగాణా ప్రభుత్వానికి సహకరించింది.

 

శ్రీశైలం, జూరాల హైడల్ విద్యుత్ ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్ కారణంగా తెలంగాణాకు కొంత ఉపశమనం లభించింది. శ్రీశైలం ఎడమకాలువ నుండి ప్రస్తుతం విడుదల చేస్తున్న నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసుకొన్న తరువాత ఆ నీటిని నాగార్జున సాగర్ డ్యాంలో నిలువచేసి ఉంచితే, మున్ముందు రెండు రాష్ట్రాలు ఆ నీటిని వాడుకోవచ్చని ఆంద్ర నీటిపారుదల శాఖ అధికారులు చేసిన సూచనకు తెలంగాణా అధికారులు సానుకూలంగా స్పందించారు.

 

ప్రస్తుతం ఎగువన కర్నాటక రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఆలమట్టి మరియు నారాయణ్ పూర్ డ్యాముల నుండి భారీగా నీరు విడుదల చేస్తున్నారు. రానున్న వారం రోజుల్లో దాదాపు 125 టీ.యం.సి.ల నీళ్ళు శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులలో చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుండి వస్తున్న నీటిని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సూచించిన విధంగా వాడుకొనేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు.

 

ప్రభుత్వాలను నడుపుతున్న రాజకీయ పార్టీలు, తమ మధ్య పార్టీ పరంగా ఉన్న రాజకీయ వైరాలను లేదా వ్యక్తిగత వైరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతీ చిన్న అంశంపై పరస్పర వ్యతిరేఖంగా వ్యవహరించడం వలన ఇరు రాష్ట్రాలకీ సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవు. అదే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తమ అహాన్ని, పంతాలను పట్టుదలను, బేషజాలను పక్కన పెట్టి, నిపుణులయిన అధికారులకు నిర్ణయాలు తీసుకొనేందుకు తగినంత స్వేచ్చ ఇచ్చినట్లయితే అనేక సమస్యలు ఇరు రాష్ట్రాలకీ ఆమోదయోగ్యంగా పరిష్కరించుకోవచ్చునని చెప్పడానికి దీనినొక మంచి ఉదారణగా చెప్పుకోవచ్చును.