ఆంద్ర ఐటీ పారిశ్రామికవేత్తలకు తెలంగాణా తివాచీ?

 

నిజమే! హైదరాబాదును ఐటీ కేంద్రంగా తీర్చిదిద్ది, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ పేరు దశదిశలా మారుమ్రోగేలా చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదే. మళ్ళీ ఇప్పుడు ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టడంతో, గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయిన ఐటీ పరిశ్రమ ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని, మళ్ళీ త్వరలోనే ఐటీ రంగానికి పూర్వ వైభవం వస్తుందని విశాఖలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పిన పారిశ్రామికవేత్తలు అందరూ ఆనంద పడ్డారు. కానీ తెదేపా ప్రభుత్వం అధికారం చేప్పట్టి దాదాపు రెండు నెలలు కావస్తున్నా వారి గోడు వినేవారు లేరు. చంద్రబాబు దేశ విదేశాల నుండి చిన్నా పెద్ద ఐటీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నారు తప్ప పెరట్లో ఉన్న ఐటీ పరిశ్రమల సమస్యలను పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్ లో ఐటీ పరిశ్రమకు మంచి భవిష్యత్ ఉంటుందనే ఆలోచనతోనే తామందరం ఇక్కడ పరిశ్రమలు స్థాపించి, ఎన్ని ఇబ్బందులున్నా ముందుకే కొనసాగుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల గోడు పట్టించుకోకపోవడంతో, తమకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్న తెలంగాణా ప్రభుత్వం వైపు వారి దృష్టి మళ్ళుతోంది. తెలంగాణాలో పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు వచ్చినట్లయితే, వారికి అవసరమయిన అన్ని సౌకర్యాలు కలిగించేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు తమకు ఆహ్వానాలు వస్తున్నాయని వారు స్పష్టం చేసారు. వారి ఆవేదన అర్ధం చేసుకోదగిందే. రాష్ట్రానికి అక్షయపాత్ర వంటి ఐటీ పరిశ్రమల స్థాపన అవసరం ఎంతుందో వాటి నిర్వహణకు ప్రభుత్వతోడ్పాటు అంతే అవసరం ఉంది.


అయితే చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆంద్రప్రజలను, విద్యార్ధులను ఏవగించుకొంటున్న తెలంగాణా ప్రభుత్వం ఆంద్ర పారిశ్రామిక వేత్తలకు మాత్రం ఎర్ర తివాచీ పరిచేందుకు సిద్దమయిందని వారు చెప్పడం. హైదరాబాదు నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం లక్షలాది ఆంధ్ర, తెలంగాణా ప్రజల సమిష్టి కృషే కారణమని అందరికీ తెలుసు. కానీ హైదరాబాదు అభివృద్ధిలో ఆంద్ర ప్రజల పాత్రను, ముఖ్యంగా చంద్రబాబు పాత్రను ఎన్నడూ అంగీకరించని తెలంగాణా ప్రభుత్వం, అదే ఆంధ్రాకు చెందిన పారిశ్రామిక వేత్తలను తెలంగాణాలో పరిశ్రమలు స్థాపించాలని, తెలంగాణా అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆహ్వానించి ఉంటే అది హాస్యాస్పదమే అవుతుంది.