గోటితో పోయే దానికి గొడ్డలి ఎందుకు

Publish Date:Jun 24, 2014

 

 

 

ఊహించినట్లే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య నీరు, విద్యుత్ సమస్యలపై కీచులాటలు మొదలయ్యాయి. ఉభయ రాష్ట్రాలు కూడా నీరు, విద్యుత్ కొరతతో సతమతమవుతున్నందున, ఈ విషయంలో వెనక్కి తగ్గేందుకు సిద్దపడటం లేదు. రెండు రాష్ట్రాల అధినేతల మధ్య సత్సంబంధాలు లేకపోవడం, ప్రభుత్వాల మధ్య పరస్పర అవగాహన లేకపోవడంతో గోటితో పోయే వ్యవహారాలు కూడా గొడ్డలి వరకు వెళ్ళిపోతున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో జరిగిన విద్యుత్ అమ్మకాల ఒప్పందాలను అన్నిటినీ రద్దు చేసుకోవాలని నిశ్చయించుకోవడంతో, ఆ విద్యుత్ పైనే ప్రధానంగా ఆధారపడిన తెలంగాణా ప్రభుత్వం వెంటనే ఆంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకపోగా బెదిరింపులకి దిగింది. రెండు రాష్ట్రాల నడుమ నెలకొన్న ఈ ప్రతిష్టంభన తొలగించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవలసి వచ్చింది.

 

అయితే ఆ సమస్య ఇంకా పరిష్కారం కాకమునుపే రెండు రాష్ట్రాల మధ్య నీటి కోసం పేచీలు మొదలయ్యాయి. ఈ నెల 20న నాగార్జున్ సాగర్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల కావలసిన 10 టీయంసీల నీటిని విడుదల చేయకుండా తెలంగాణా ప్రభుత్వం నిలిపివేయడంతో ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, రవి కిషోర్ తదితరులు ఉభారాష్ట్రాలకు గవర్నర్ అయిన నరసింహన్ను ఈరోజు కలిసి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తక్షణమే రాష్ట్రానికి నీటిని విడుదల చేయమని తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరారు. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖా ఇంజనీర్లతో కూడిన ఒక నిపుణుల కమిటీ నీటి విడుదలకు ఆమోదం తెలిపినప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా నిలిపివేయడాన్ని వారు తప్పు పట్టారు. అదేవిధంగా ఈ కమిటీలో తెలంగాణకు చెందిన ఇంజనీర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని సంప్రదించకుండా, ఆయన అనుమతి తీసుకోకుండా నీటి విడుదలకు అంగీకరించడాన్ని టీ-మంత్రి హరీష్ రావు కూడా తప్పు పట్టారు. త్రాగు నీటికోసం విడుదల చేస్తున్న నీటిని దిగువన రైతులు తమ నర్సరీలకు వినియోగించుకొంటున్నారని అందుకే నీటిని నిలిపివేశామని హరీష్ రావు తెలిపారు.

 

ఈ వ్యవహారంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంబన ఏర్పడంతో మళ్ళీ కేంద్రమే జోక్యం చేసుకోవలసి వచ్చింది. కేంద్ర జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఏబీ.పాండ్యే ఈరోజు సాయంత్రం హైదరాబాదులో రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో చర్చలు జరుపనున్నారు. ఆ చర్చలు సఫలమయితే రేపు రాష్ట్రానికి నీళ్ళు విడుదల అయ్యే అవకాశం ఉంది. లేకుంటే రెండు రాష్ట్రాల మధ్య ఈ యుద్ధం మరింత తీవ్రతరంయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రా స్థాయిలో ప్రభుత్వాలు, సంబందిత మంత్రిత్వ శాఖలు, ఉన్నతాధికారులు కలిసి కూర్చొని చర్చించుకోవలసిన ఈ అంశాన్ని తీసుకు వెళ్లి కేంద్రం చేతిలో పెట్టడం వలన, కేంద్రానికి తెలుగు ప్రజలంటే మరింత చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉంది. అందువలన ఇప్పటికయినా రెండు ప్రభుత్వాలు విజ్ఞత ప్రదర్శిస్తూ, సమస్యలను సామరస్యంగా చర్చించు కోవడం మేలు.

By
en-us Political News