కలసి ఉంటే కలదు సుఖం

 

తెలంగాణా రాష్ట్ర సాధన కోసం తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఆంధ్రా పాలకులు, ప్రజల పట్ల తమ ప్రజలలో విద్వేషం రగిల్చిన మాట వాస్తవం. కానీ తన లక్ష్యం నెరవేరి తనే స్వయంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా అదే రకమయిన వైఖరి, భావనలు వ్యక్తం చేస్తుండటం వలన రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవలు అనివార్యమయ్యాయి. ఒకప్పుడు కలిసి పనిచేసిన తెదేపాతో దాని అధ్యక్షుడు చంద్రబాబుతో ఆయనకున్నరాజకీయ వైరం, వ్యక్తిగత అభిప్రాయల కారణంగానే, చర్చలతో పరిష్కరించుకోదగ్గ అనేక సమస్యలు కోర్టుల వరకు వెళ్ళిపోతున్నాయి. దానివలన నష్టమే తప్ప ఇరు రాష్ట్రాలకు, ప్రభుత్వాలకు, ప్రజలకు, పార్టీలకి కూడా ఏమాత్రం మేలు చేయదు.

 

ఇంతకాలం “మేమందరం తెలుగు వాళ్లమని సగర్వంగా చెప్పుకొనే పరిస్థితి పోయి, ఇప్పుడు మేము ఆంధ్రా వాళ్ళము, మేము తెలంగాణా వాళ్ళము” అని చెప్పుకొనే దుస్థితి కలగడం చాల దురదృష్టకరం. కనుక ఇప్పటికయినా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు, పార్టీలు తమ తమ విభేదాలు, భేషజాలు అన్నిటినీ పక్కన పెట్టి రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా అభివృద్దే లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని గవర్నర్ నరసింహన్ ఇరువురు ముఖ్యమంత్రులను కోరారు. అందుకు వారిరువురూ అంగీకరించారు కూడా.

 

ఇరు ప్రభుత్వాల ముఖ్యకార్యదర్శుల స్థాయిలో తరచూ సమావేశాలు నిర్వహించుకొంటూ, అవసరమయినప్పుడల్లా ముఖ్యమంత్రులు కూడా సమావేశమవుతూ ఎప్పటికప్పుడు అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని అని గవర్నరు కోరికను వారిరువురు మన్నించడం అభినందనీయం. వారిరువురి మధ్య తను స్వయంగా సమన్వయకర్త వ్యవహరించేందుకు సిద్దమని గవర్నర్ నరసింహన్ ముందుకు రావడం కూడా చాలా హర్షణీయం.

 

ఎటువంటి సమస్యనయినా చర్చల ద్వారా తప్ప మరేవిధంగాను పరిష్కరించే అవకాశం లేదని తెలిసి ఉన్నప్పుడు కూడా పంతాలకు, పట్టుదలలకు పోయినట్లయితే నష్టపోయేది మనమేనని ఇరు ప్రభుత్వాధినేతలకీ కూడా తెలుసు. కనుక ఇకనయినా ఒకరికొకరు సహకరించుకొంటూ ఇరు రాష్ట్రాల అభివృద్ధికి కలిసి కృషి చేస్తే, ప్రజలు కూడా హర్షిస్తారు. రెండు రాష్ట్రాలలో ఒకటి ఎక్కువ అభివృద్ధి చెంది మరొకటి ఈసురోమంటుంటే అది తెలుగుజాతికే అవమానం. అదే ఒకదానితో మరొకటి పోటీపడి అభివృద్ధి చెందితే తెలుగుజాతికే గర్వకారణంగా నిలుస్తుంది.