ముఖ్యమంత్రుల సమావేశం ఉభయ రాష్ట్రాలకు శుభపరిణామం

 

ఆంధ్ర, తెలంగాణాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడక ముందు నుండే వాటి మధ్య మొదలయిన యుద్ధం, ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత కూడా కొనసాగుతూనే ఉంది. ఎంతో బాధ్యాతాయుతంగా మెలగవలసిన ప్రభుత్వాలు నిత్యం ప్రతీ చిన్న అంశంపై అతిగా స్పందిస్తూ ఘర్షణపడటాన్ని ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. ఇక ఈ పరిస్థితిలో ఎన్నటికీ మార్పు రాబోదని అందరూ నిరాశ చెందుతున్న వేళ, గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకొని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యేలా చేయగలిగారు. ఆయన ప్రతిపాదనకు వారిరువురూ అంగీకరించడం, నిన్న సమావేశం అవడం ఒక మంచి పరిణామమని చెప్పవచ్చును.

 

అయితే మొదటి సమావేశంలోనే ఏవో అద్భుతం జరిగి, సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని ఆశించడం అత్యాసే అవుతుంది. కానీ ఇంతవరకు పరస్పరం కత్తులు దూసుకొంటున్న ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు తొలిసారిగా సమావేశమవడం, ఇరువురూ కూడా పట్టువిడుపులు ప్రదర్శిస్తూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొనేందుకు సిద్దపడటం రెండు రాష్ట్రాలకు కూడా శుభపరిణామమేనని చెప్పవచ్చును. ఒకరిపై మరొకరు పిర్యాదులు చేసుకొంటూ కేంద్రం వద్ద, సుప్రీంకోర్టులో పంచాయితీలు పెట్టుకోకుండా, రాష్ట్ర స్థాయిలోనే వాటి పరిష్కారానికి ప్రయత్నిద్దామని ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించడం చాలా హర్షణీయం.

 

ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు, నీరు, విద్యుత్ వంటి పంపకాలను రాష్ట్ర స్థాయిలోనే చర్చించుకొని పరిష్కరించుకొందామని ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించడం చాలా తెలివయిన నిర్ణయం. ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు, నీరు, విద్యుత్ వంటి పంపకాలను రాష్ట్ర స్థాయిలోనే చర్చించుకొని పరిష్కరించుకొందామని ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించడం చాలా తెలివయిన నిర్ణయం. సానుకూల దిశలో పడిన తొలి అడుగు అని చెప్పవచ్చును. నిజానికి ఈ పని వారు అధికారం చేప్పట్టిన వెంటనే చేసి ఉండి ఉంటే, బహుశః నేడు ఈ సమావేశం కూడా అవసరమయి ఉండేది కాదేమో! కానీ ఇంతవరకు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్న తెరాస, తెదేపా రాజకీయ నేతలుఈ విభజన సమస్యలకు రాజకీయాలు కూడా జోడిస్తున్నందునే అవి మరింత ముదిరిపోయాయి. ఆలస్యంగానయినా ఈ విషయాన్నీ ఇరువురు ముఖ్యమంత్రులు గుర్తించి, ఇకపై ఈ సమస్యల పరిష్కరించే బాధ్యతను ఇరు రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులకు అప్పగించి, వారు పరిష్కరించలేనప్పుడే తాము జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకోవడం చాలా మంచి నిర్ణయం.

 

గవర్నరు పుణ్యమాని ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య కొంత సయోధ్య కుదిరింది గనుక వారు చెప్పిన మాటకు కట్టుబడి అధికారులకే ఆ భాద్యత వదిలిపెట్టినట్లయితే, నిపుణులు మేధావులయిన అధికారులు చాలా సమస్యలను పరిష్కరించగలరు. ఉదాహరణకు ఇటీవల ఆంద్ర, తెలంగాణా నీటిపారుదల శాఖా కార్యదర్శులు చర్చించుకొని, ఆంద్ర రాష్ట్రం అధీనంలో ఉన్న శ్రీశైలం ఎడమ కాలువ నుండి దిగువన తెలంగాణకు చెందిన హైడల్ విద్యుత్ ప్రాజెక్టుకు నీళ్ళు విడుదలయ్యేలా చేసి విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చేయగలిగారు. అదేవిధంగా ముఖ్యమంత్రులిరివురూ తమ నేతలు అధికారులపై అనవసరమయిన కర్ర పెత్తనం చేయకుండా నియంత్రించి, అధికారులకు కొంత స్వేచ్చ ఇచ్చినట్లయితే వారు ఇదేవిధంగా అనేక సమస్యలను పరిష్కరించగల సమర్ధులు.

 

ఇరువురు ముఖ్యమంత్రులు తమ సమావేశం సహృద్భావ వాతావరణంలో సానుకూలంగా జరిగిందని వేర్వేరుగా మీడియా సమావేశాలు పెట్టి మరీ చెప్పడం గమనిస్తే వారి సమావేశం ఫలవంతం అయిందని అర్ధమవుతోంది. రౌతును బట్టే గుర్రం నడుస్తుంది కనుక, ముఖ్యమంత్రులిరువురూ ఘర్షణ వైఖరి విడనాడి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోనేందుకే మొగ్గు చూపినట్లయితే, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందరూ కూడా ఆ దిశలోనే నడిచే అవకాశం ఉంటుంది. అప్పుడే రెండు రాష్ట్రాల మధ్య పెరిగిన ఈ దూరం క్రమంగా తగ్గి, అభివృద్ధి పధం వైపు సాగేందుకు వీలు చిక్కుతుంది.