అమరావతి రైతులపై కేసుల ఉపసంహరణ
Published on: Fri Jun 20, 2025 6:25PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్ కలిగించింది. జగన్ హయాంలో వారిపై పెట్టిన కేసులను ఎత్తివేసింది.జగన్ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేస్తూ మొదలు పెట్టిన మూడు రాజధానుల విధానానికి వ్తయతికేకంగా చారిత్రాత్మక ఆందోళన చేసిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ బనాయించిన కేసులను ఉపసంహరించుకుంది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి శుక్రవారం (జూన్ 20) ఉత్తర్వులు జారీ చేశారు. రైతులపైనే కాకుండా వేతనాల పెంపు కోసం ఆందోళన చేపట్టి ధర్నా చేసిన అంగన్ వాడీ కార్యకర్తలపై అప్పటి జగన్ ప్రభుత్వం బనాయించిన కేసులను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు హోంశా ఆ ఉత్తర్వులలో పేర్కొంది. ఈ నిర్ణయంతో అమరావతి రైతులకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు భారీ ఊరట దక్కింది.
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం ముందు అమరావతి రైతులు అప్పట్లో నిరసన తెలిపారు.దీంతో జగన్ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది. 2020 ఆగస్టు 26న గవర్నర్‌పేటలోని సీఆర్‌డీఏ కార్యాలయం దగ్గర రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ప్రభుత్వం వారిని అడ్డుకుని అరెస్టు చేసింది. కేసులు పెట్టింది. ఆ కేసులను ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.


