ప్రదీప్‌కు అందరూ ఎందుకు వత్తాసు పలుకుతున్నారో తెలుసా..?

 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విపరీత ధోరణులున్న మనుషులు ఒక కోరికని బలంగా వ్యక్తీకరిస్తున్నారు... ‘‘యాంకర్ ప్రదీప్ తప్పతాగి డ్రైవ్ చేసి చాలా పెద్ద నేరం చేశాడు.. నీతులు చెప్పిన అతనే డ్రంకెన్ డ్రైవ్ చేశాడు.. అంచేత  అతనికి జైలుశిక్ష పడాలి. యాంకర్‌గా అవకాశాలన్నీ పోవాలి... చివరికి బికారిగా మిగలాలి’’ ఇదీ వరస! ఇలాంటి ధోరణులకు వత్తాసు పలికే మీడియా, సోషల్ మీడియా వుండనే వున్నాయి. వీళ్ళు కూడా తమ శాయశక్తులా కథనాలను వండివారుస్తున్నారు. తమ బుర్రకి తోచిన ఊహాగానాలను జనంలోకి వదులుతున్నారు. ప్రదీప్‌ని యాంకర్‌గా ఎంకరేజ్ చేయకూడదని ఛానళ్ళు నిర్ణయించుకున్నాయనే గాలివార్త కూడా వీటిలో ఒకటి. అసలింతకీ ప్రదీప్ అంత పెద్ద నేరం చేశాడా? తాగి డ్రైవ్ చేయడమే ఘోరమా? ఈమాత్రం దానికే అతనికి జైలుశిక్ష పడిపోవాలా?

 

హైదరాబాద్‌లో ప్రతిరోజూ డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు జరుగుతూనే వుంటాయి. రోజుకు వేలాదిమంది పోలీసులకు దొరికిపోతూ వుంటారు. ఫైనో, చిన్నపాటి శిక్షలో విధిస్తూ వుంటారు. అలాంటి వేలాదిమందిలో ప్రదీప్ కూడా ఒకడు. అది కూడా ప్రపంచమంతా తాగి తందనాలు ఆడే న్యూ ఇయర్ రోజునే ప్రదీప్ తాగి డ్రైవ్ చేశాడు. ఖర్మ కాలి, దరిద్రం నెత్తిమీద వుండి దొరికిపోయాడు. ప్రదీప్‌ని పోలీసులు పరీక్షిస్తే సదరు మీటరు 178 చూపించిందట. అదేదో మర్డర్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్టు కొంతమంది ఫీలింగ్. మీటర్ అంత చూపించింది కాబట్టి ప్రదీప్‌కి శిక్ష పడటం ఖాయమని ఎవరికి వారే జడ్జిలు అయిపోయి తీర్పులు ఇచ్చేస్తున్నారు. మర్డర్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వాళ్ళకే శిక్ష పడని ఈ రోజుల్లో ఏదో పొరపాటుగా చేసిన చిన్న తప్పుకి జైలు శిక్షల వరకూ వెళ్ళడం ఎంత వరకు న్యాయం? న్యూ ఇయర్ రోజున హైదరాబాద్‌లో ప్రదీప్‌తోపాటు కొన్ని లక్షల మంది తప్పతాగారు. కొన్ని వేల మంది డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయారు. ప్రదీప్‌ని పోలీసులు పరీక్షించినప్పుడు మీటర్ చూపించింది 178. అయితే మీటర్ 5 వందలకు మించి చూపించిన మహాతాగుబోతులు చాలామంది ఆరోజు దొరికారు. వాళ్ళతో పోలిస్తే ప్రదీప్ చాలా బెటర్ కదా!

 

పొరపాట్లు అందరూ చేస్తారు.. నీతులు చెప్పాడు కాబట్టి పొరపాటు చేయకూడదు... డ్రంకెన్ డ్రైవ్ చేయొద్దని చెప్పిన ప్రదీపే తాగి డ్రైవ్ చేశాడు కాబట్టి శిక్షించాలని కొంతమంది వాదిస్తున్నారు. నీతులు చెప్పేవారు తప్పు చేస్తే శిక్షించేపనయితే మన దేశంలో చాలమంది రాజకీయ నాయకులని, అధికారులని, ఉన్నత స్థానాల్లో వున్నవారిని అర్జెంటుగా శిక్షించాలి. వారిని శిక్షించే శక్తి మన వ్యవస్థకు లేనప్పుడు ప్రదీప్‌ని మాత్రం ఎందుకు శిక్షించాలి? అతనికి ఒక్క అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? ఎప్పుడో ఏ మహానుభావుడో చెప్పినట్టు... మనలో పాపం చేయనివాడు ఎవరో చెప్పండి.. ఏ లోపం లేనివాడు ఎవరో చూపండి...