కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా మరో ఉగ్ర దాడి
Published on: Wed Jun 12, 2019 7:59PM

జమ్మూకాశ్మీర్‌లో లోక్ సభ ఎన్నికల ముందు ఫిబ్రవరి లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన దారుణ సంఘటన, దానికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ భూభాగం పై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం తెలిసిందే, ఇప్పుడు తాజాగా మళ్ళీ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో భద్రతా బలగాల మీద మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. రద్దీగా ఉండే కేపీ రోడ్డులో పోలీస్ పార్టీ మీద ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో మరో 12 మంది కూడా గాయపడినట్టు సమాచారం. ఉగ్రవాదులు ఓ వైపు కాల్పులు జరుపుతూ మరోవైపు గ్రెనేడ్లు కూడా విసిరినట్టు తెలిసింది. అయితే ఈ దాడిని భారత భద్రత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.


