నోరు జారిన కేంద్రమంత్రి... ప్రకాశ్‌రాజ్ ఫైర్

రాజ్యాంగాన్ని మార్చేస్తామని.. అందుకే తాము అధికారంలోకి వచ్చామంటూ కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపింది. దీనిపై సర్వత్రా నిరసనలు రావడంతో ఆయన పార్లమెంటు సాక్షిగా క్షమాపణలు చెప్పారు. ఆ వివాదం సద్దుమణిగి అంతా మరచిపోతున్న వేళ తాజాగా అనంత కుమార్ మరోసారి నోరు జారారు. బళ్లారిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గోనేందుకు వచ్చిన ఆయన కాన్వాయ్‌ని కొంతమంది దళితులు అడ్డుకున్నారు. రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు.

 

అనంతరం తన కార్యక్రమంలో పాల్గొన్న అనంత్ కుమార్ మాట్లాడుతూ.. మేం మీకు సాయం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాము... ఏదేమైనా మేం మీతో ఉంటాము.. మా ప్రజలను బతికించుకునేందుకు మేం ఏమైనా సాయం చేస్తాం.. వీధి కుక్కుల అరుపులకు.. ఆందోళనలు.. నిరసనలకు మేం తలవంచబోం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నటుడు ప్రకాశ్ రాజ్‌ వెంటనే రంగంలోకి దిగారు. మంత్రిగారు చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారని.. ఇక ఆయన ఆపాలని.. దళితులను వీధికుక్కలంటూ అవమానిస్తారా..? అని ట్వీట్ చేస్తారా..? అనంత్‌కుమార్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు.