శ్రీరామజపం చేస్తున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి కాపు
Published on: Wed Apr 25, 2012 11:18AM
అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న కాపు రామచంద్రారెడ్డి శ్రీరామజపం చేస్తున్నారు. అయితే ఆయన చేస్తున్నది భద్రాది శ్రీరామచంద్రుడి గురించి కాదు, కర్ణాటక మాజీమంత్రి బి.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీరాములు గురించి. శ్రీరాములు గాలి జనార్థనరెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఇటీవల బిఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలిచారు. గాలి జనార్థనరెడ్డితో పాటు శ్రీరాములుకు అత్యంత సన్నిహితునిగా మెలిగిన కాపు రామచాద్రారెడ్డి తన ఎన్నికల ప్రచారానికి శ్రీరాములును రాయదుర్గం ఆహ్వానించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని జగన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, తానే ఇక్కడ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోతున్నట్లు శ్రీరాములు సమక్షంలో కాపు రామచంద్రారెడ్డి ప్రకటించుకున్నారు.
అంతేకాక కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి శ్రీరాములేనంటూ ఆయనను పొగడ్తలతో ముచేట్టారు. శ్రీరాములు అనేక మంచి పనులు చేపట్టారని, ఆ రాష్ట్ర ప్రజలు శ్రీరాములు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. నిజానికి ఒక దశలో కాపుకు టిక్కెట్టు ఇవ్వాలా? వద్దా? అన్న మీమాంసలో జగన్ పడ్డారు. అయితే కర్ణాటక ఎమ్మెల్యే శ్రీరాములు జోక్యం చేసుకుని కాపుకు టిక్కెట్టు ఇప్పించారు. దీనికి కృతజ్ఞతగా శ్రీరాములును ఆయన పొగడ్తలతో ముంచెత్తినట్లు తెలిసింది.


