వెలుగు చూడని మరో ఐరన్ ఓర్ స్కాం?
Published on: Thu Apr 26, 2012 10:33AM
అనంతపురంలో విలువైన ఇనుపఖనిజాన్ని అక్రమంగా స్వాహా చేశారన్న ఆరోపణలపై ఓబులాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్థనరెడ్డిని సిబీఐ ఇప్పటికే అరెస్టు చేసి జైలులో కూర్చోబెట్టింది. అయితే బళ్ళారి ఐరన్ ఓర్, వై, మహాబలేశ్వరప్ప కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఖనిజాన్ని దోచుకున్నప్పటికీ పోలీసులు, సిబీఐ అధికారులు ఆ సంస్థలను పట్టించుకోలేదు. నిజానీ బళ్ళారి ఐరన్ ఓర్, మహాబలేశ్వరప్ప కంపెనీలపై కూడా కేసులు నమోదయ్యాయి. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రెండు కంపెనీలపై కేసులు పెట్టారు. ఎఫ్.ఐ.ఆర్.లో మాత్రం బళ్ళారి ఐరన్ ఓర్ పేరు మాత్రమే నమోదు చేశారు.
ఆ తరువాత దీనిపై కూడా ఎటువంటి విచారణ చేపట్టకుండానే కేసులను మూలపడేశారు. అప్పట్లో ఈ రెండు కంపెనీల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దఎత్తున ముడుపులు ముట్టాయని అందుకే ఈ రెండు కంపెనీలపై చర్యలు తీసుకోకుండా వదిలేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు కంపెనీలు సుమారు ఏడువందల కోట్ల రూపాయల విలువైన్ ఇనుప ఖనిజాన్ని క్రమంగా రవాణా చేసినట్లు తెలుస్తోంది. తమకు కేటాయించిన భూముల్లోనే కాకుండా ప్రభుత్వ భూముల్లో కూడా ఖనిజాన్ని ఈ రెండు కంపెనీలు పెద్ద ఎత్తున తవ్వేసినట్లు తెలిసింది. సిబీఐ ఈ రెండు కంపెనీలపై కూడా దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


