మోడీ పకోడీ వ్యాఖ్యలను సమర్థించిన ఆనందీ బెన్... అది ఓ నైపుణ్యం..


ఇటీవల ఓ టీవీ ఇంటర్వూలో మోదీ మాట్లాడుతూ...తమ పాలనలో యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామన్న సంఖ్యపై చర్చించడం కాదని, అసలు ఉపాధి కల్పన జరుగుతున్న తీరును గుర్తించాలని, పకోడా అమ్ముతున్న వ్యక్తి రోజుకు రూ.200 సంపాదిస్తుండటాన్ని కూడా ఓ ఉద్యోగం కిందే చూడాలని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. పకోడా విక్రేతల తర్వాత ప్రభుత్వం బిచ్చగాళ్లను కూడా ఉద్యోగులుగానే పరిగణించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో మోడీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు సమర్ధించుకునే పనిలో పడ్డారు. ఇప్పుడు ఆ జాబితాలో మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ కూడా చేరిపోయారు. పకోడా తయారీ ఓ నైపుణ్యం అని, భవిష్యత్తులో పెద్ద పెద్ద వ్యాపారాల ప్రారంభానికి అది తొలిమెట్టు అని ఆమె చెప్పుకొచ్చారు. "ఈ రోజు పకోడా తయారు చేసి అమ్మేవారు రెండేళ్లకు హోటల్ ఆ తర్వాత నాలుగైదారేళ్లలో సొంతంగా ఓ రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించే స్థాయికి ఎదుగుతారు. పకోడా తయారీ ఓ మంచి పనికాదని భావించొద్దు. మంచి పకోడా లేదా రుచికరమైన పకోడా చేయలేకపోతే కస్టమర్లు రారు" అని మోదీ పకోడా వ్యాఖ్యలకు ఆమె వివరణ ఇచ్చారు. మొత్తానికి పకోడా వెనుక ఇంత కథ ఉందని బీజేపీ నేతలు చెప్పేంత వరకూ తెలీదు మరి..