జేసిఫై కన్నెర్రజేస్తున్న అనంత
Published on: Mon Mar 12, 2012 1:17PM
అ
నంతపురం: అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికల నిర్వహణ తేదీ ఇంకా వెలువడలేదు కానీ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు మాత్రం బహిర్గతమయ్యాయి. అనంతపురం టిక్కెట్ ను ఎవరికి ఇవ్వాలన్న విషయంపై మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి మధ్య వివాదం చెలరేగింది. అనంత టిక్కెట్ ను తన సోదరుడు సుబ్బారెడ్డికి టిక్కెట్ ఇస్తే సహించేది లేదని వారు ఇప్పటికే ప్రకటించారు. ఈ అసమ్మతి నేతలు మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి డైరెక్షన్ లో నడుస్తున్నారని అనంత వెంకటరామిరెడ్డి, రఘువీరారెడ్డి తదితరులు అనుమానిస్తున్నారు. వీరిని ఇలా వదిలేస్తే పార్టీ పరిస్థితి జిల్లాలో మరింత దిగజారి పోతుందని అనంత వెంకటరామిరెడ్డి, రఘువీరారెడ్డి అనుమానిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. వీరి వ్యవహారం జేసి వర్గానికి మరింత కోపాన్ని కలిగించింది. దీంతో వారు ఎంపి అనంత వెంకటరామిరెడ్డిని టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆయన కార్యకర్తల రక్త మాంసాలతో విందు భోజనం అరగిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. అంతేకాక అనంత వెంకటరామిరెడ్డి మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్ధనరెడ్డి నుంచి రూ.5 కోట్లు ముడుపులు తీసుకున్నారని కూడా వారు ఓపెన్ గానే ఆరోపించారు. ఈ ఆరోపణలతో అనంతపురం కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరింత ముదిరినట్టయింది.


