జె.సి.అల్లుడికి రాయదుర్గం దేశం టిక్కెట్టు?
Published on: Thu Mar 8, 2012 1:13PM
అ
నంతపురం జిల్లా: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీకి పలువురు దేశం నాయకులు సిద్దపడుతున్నారు. అయితే ఈ టిక్కెట్ జెసి ప్రభాకర్ రెడ్డి అల్లుడయిన దీపక్ రెడ్డి కి ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి చంద్రబాబునాయుడును కలుసుకోగా ఎటువంటి అపోహలకు తావులేకుండా వెళ్లి రాయదుర్గం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో దీపక్ రెడ్డి రాయదుర్గంలో మకాం వేసి ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా తాజా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి గాని లేదా ఆయన సూచించిన వ్యక్తికిగాని ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాటిల్ వేణుగోపాలరెడ్డి రంగంలోఉండటం దాదాపు ఖాయమైంది. ఈ నియోజకవర్గంలో బిసి, మైనార్టీ ఓట్లు గెలుపు, ఓటములను నిర్ణయిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయా సామాజికవర్గాల ఓట్లను దక్కించుకోవడానికి అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.


