జగన్ పార్టీ వైపు ఆనం సోదరులు.. బొత్సా ప్రయత్నాలు

 

ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ మొదలు డీఎస్ వరకూ చాలా మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇప్పుడు ఆనం సోదరులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే యోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే నెల్లూరు జిల్లాకి చెందిన ఆనం సోదరులు బొత్సా సత్యనారాయణకి సన్నిహితులు కావడంతో ఈ ఇద్దరు సోదరులను వైసీపీ లోకి తీసుకొచ్చే బాధ్యతను తను తీసుకని దీనిలోభాగంగా ఆనం సోదరులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారట. మరో వైపు బొత్సా ప్రయత్నాలు ఫలించనచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

 

అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆనం సోదరులకు తిరుగుండేది కాదు. అంతేకాదు రాజశేఖర్ రెడ్డి కి కూడా ఈ సోదరులు చాలా సన్నిహితలుగా ఉండేవారు. గతంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయాలని చర్చలు జరిగినప్పుడు సంతకాలు చేసిన వారిలో ఆనం సోదరులు ముందున్నారు. అయితే తరువాత జగన్ వేరే పార్టీ పెట్టినా వీరిద్దరు మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు. అప్పట్లో జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఉనికి లేదు.. అసలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో లేదో కూడా తెలియదు.. ఈనేపథ్యంలో ఆనం సోదరులు కూడా పార్టీ మారడానికే సముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే చాలా రోజులనుండి వీరు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడంలేదని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అయితే ఆనం సోదరుల ఎంట్రీకి జిల్లాలోని ఇతర నేతల అభిప్రాయాలను కనుగొన్న తరువాత జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి బొత్సా ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.

 

ఇదిలా ఉండగా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు చాలా మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. దీనిపై ఇప్పటికే చాలామంది విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి అందరూ కలిసి జగన్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తారేమో అని విమర్శించారు కూడా మరి నిజంగానే కాంగ్రెస్ నేతలందరూ కలిసి జగన్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తారేమో చూడాలి.