TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గుట్టు విప్పుతున్న సునీల్ రెడ్డి

Published on: Mon Jan 30, 2012 8:19AM

హైదరాబాద్ : ఎమ్మార్ స్కామ్‌లో కోట్ల రూపాయలను అక్రమంగా దండుకున్న సూత్రధారుల గుట్టు క్రమంగా విడిపోతోంది. ఎమ్మార్ కుంభకోణంలో అరెస్టయిన జగన్ బంధువు సునీల్‌రెడ్డి నుంచి సీబీఐ అధికారులు కీలకసమాచారాన్ని రాబట్టారు.దర్యాప్తు అధికారులు సునీల్‌ను  స్టైలిష్ హోమ్స్ రంగారావు సమక్షంలో  ఏడుగంటలపాటు ప్రశ్నించారు.  రంగారావు చెబుతున్న వివరాలకు, సునీల్ చెబుతున్న వివరాలకు పొంతన కుదరట్లేదని గుర్తించారు. దీంతో రంగారావు, సునీల్‌ను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినట్లు తెలిసింది.ఆదివారం ఉదయమే టి.రంగారావును దిల్‌కుషాకు పిలిపించిన సీబీఐ అధికారులు ఏయే తేదీల్లో సునీల్ చేతికి ఎంతిచ్చారు? ఆ సొమ్మును సునీల్ ఎవరికి అందజేశారు? అనే కోణంలో ఇద్దరినీ ప్రశ్నించినట్లు తెలిసింది. సునీల్ దాచిన కొన్ని విషయాలను రంగారావు వెల్లడించడంతో సూత్రధారుల అసలు గుట్టును బయట పెట్టక తప్పని పరిస్థితి సునీల్‌కు ఏర్పడింది. దీంతో అక్రమ బాగోతంపై సీబీఐ ఓ నిర్ధారణకు వచ్చింది.

డాక్యుమెంట్ల పరంగా దాదాపుగా చార్జ్‌షీట్ సిద్ధం చేసిన దర్యాప్తు అధికారులు సునీల్ వెల్లడించిన కీలక సమాచారాన్ని సైతం మొదటి చార్జ్‌షీట్‌లోనే పొందుపరచాలని భావిస్తున్నారు.సోమవారం మధ్యాహ్నానికి సునీల్‌రెడ్డి కస్టడీ గడువు ముగియనుండడంతో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే మరిన్ని రోజులు కస్టడీకి కోరాలని భావిస్తున్నారు. కాగా ఎమ్మార్‌కు సంబంధించి మరికొంతమందిని సోమ, మంగళవారాల్లో అరెస్టు చేయవచ్చని సమాచారం. అరెస్టు చేసినవారినుంచి సేకరించిన ఆధారాలతో ఈ కేసులో మొదటి నిందితుడైన ఐఏఎస్ బి.పి.ఆచార్యను అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది.