అమ్మఒడి పథకంలో సడలింపులు!!

2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సంసిద్ధమవుతుంది. ఈ నెల 9వ తేదీన అమ్మఒడి కార్యక్రమాన్ని చిత్తూరు వేదికగా ప్రారంభించనున్నారు సీఎం జగన్మోహనరెడ్డి. అమ్మఒడి ద్వారా పిల్లలను చదివిస్తున్న 43 లక్షల మంది తల్లులకు రూ.15000 రూపాయల చొప్పున అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో ఒకటి నుంచి 12 వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లుల్లో అర్హులైన వారందరికీ అమ్మ ఒడి పథకం వర్తించనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.6500 కోట్లు ఖర్చు చేయనుంది. క్యాంపు కార్యాలయంలో అమ్మఒడి పై సీఎం సమీక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పిల్లల్ని చదివించే తల్లులకు ఏడాదికి రూ.15000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే తొలి ఏడాది కావడంతో పథకం వర్తింపు విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. 75 శాతం హాజరు ఉంటేనే పథకం వర్తిస్తుందన్న విషయంలో ఈసారికి మినహాయింపు ఇచ్చారు. అమ్మఒడి పథకంలో అనాధ పిల్లలకు సంబంధించి సగం డబ్బు వారికి ఆశ్రయమిచ్చే అనాథాశ్రమాలకు ఇవ్వాలని మిగిలిన సగం పిల్లల పేరిట ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మార్పు నాణ్యతా ప్రమాణాల పైనా సీఎం చర్చించారు. ఫిబ్రవరి 20 నుంచి పిల్లలకు కొత్త మెనూ ప్రకారం మరింత నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.