హాట్ సమ్మర్లో… ఏపీ బీజేపి, టీడీపీ మధ్య కోల్డ్ వార్!

 

అమిత్ షా తెలుగు రాష్ట్రాల పర్యటన హాట్ హాట్ గా సాగుతున్నట్టే కనిపిస్తోంది. ఒకవైపు తెలంగాణలో ఓపెన్ వార్ కి తెరతీసిన షా ఆంధ్రాలో కూడా పార్టీ బలోపేతానికి నడుం బిగించారు. అయితే, ఈ క్రమంలో తెలంగాణలో పెద్దగా ఇబ్బందులేం లేవు. ఎందుకంటే, అక్కడ టీఆర్ఎస్ ని హ్యాపీగా టార్గెట్ చేయవచ్చు. గులాబీతో కమలానికి ఎలాంటి పొత్తు లేదు కాబట్టి! కాని, ఏపీలో సీన్ డిఫరెంట్ గా వుంది. అధికార పార్టీతో పొత్తులో వున్న బీజేపి మంత్రివర్గంలో కూడా వుంది. అయినా, బీజేపి, టీడీపీ నేతల మధ్య పదాల ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూనే వుంది. ఇదే ఇప్పుడు అమిత్ షా ముందుకొచ్చిన ప్రధానాంశం అంటున్నారు…

 

తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను టార్గెట్ చేసిన అమిత్ షా విజయవాడ ఫ్లైట్ ఎక్కారు. అదీ ఆంధ్రా సీఎంతో కలిసి. మరి వారిద్దరి మధ్యా  సంభాషణ ఎలా జరిగింది? అది అధికారికంగా తెలిసే ఛాన్స్ లేకున్నా… బయటకి వినిపిస్తోన్న టాక్ మాత్రం … చంద్రబాబు లోకల్ బీజేపి నేతల వ్యవహార శైలిపై షాకి కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. బేజేపీతో పొత్తు కారణంగా టీడీపీ కొంత నష్టపోయినా తాము దేశ సంక్షేమం కోసం మోదీతో కలిసి సాగుతున్నామని అన్నారట. కాని, ఏపీ కాషాయ నేతలు మాత్రం పదే పదే ఇష్టానుసారం మాట్లాడుతున్నారనీ, కట్టడి చేయాలని చెప్పారట బాబు!

 

టీడీపీ నాయకులు బీజేపికి వ్యతిరేకంగా మాట్లాడితే తాను కఠినంగా హెచ్చరించానని కూడా బాబు షాకి చెప్పారట. ఇదంతా విన్న బీజేపి జాతీయ అధ్యక్షులు సీఎంతో ఏమన్నారో తెలియదుగాని… విజయవాడలో దిగిన ఆయనకు ఆంధ్రా బీజేపి నేతలు కూడా కంప్లైంట్లు వినిపించారట. టీడీపీ నాయకుల మాటలు అసలు పొత్తు అక్కర్లేదన్నట్టు దురుసుగా వున్నాయని వారన్నారట! అంతే కాదు, బీజేపి సైకిల్ తో కలిసి సాగటం వల్ల వెనుకబడిపోతోందని, ఒంటరిగా ముందుకు వెళ్లాలని సూచించారట! మరి వాళ్ల విన్నపాల్ని అమిత్ షా సీరియస్ గా తీసుకుంటారా? ఎన్డీఏలో విశ్వాసపాత్రమైన భాగస్వామిగా వున్న టీడీపీని అంత తేలిగ్గా వద్దనుకుంటారా? ఇవన్నీ ఎలక్షన్ల ముందుగాని తెలియవు!

 

ఏపీలో పరిస్థితి చూస్తోంటే … టీడీపీ, బీజేపి లోకల్ నాయకులు చాలా మందికి పొత్తు భారంగానే వున్నట్టు కనిపిస్తోంది. కాని, ఇటు చంద్రబాబు, అటు మోదీ ఇద్దరికీ ఇప్పుడప్పుడే తెగదెంపులు చేసుకుని ఇతర పార్టీలకు లాభం చేయాలని లేదు. కారణం… రాజ్యసభలో , రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ అవసరం బీజేపికి ఇంకా చాలా వుంది. అలాగే, నవ్యాంధ్ర తొలి సర్కార్ కి కూడా కేంద్ర సాయం ఇంకా చాలా ఏళ్ల వరకూ కావాల్సిందే. అప్పుడే నిలదొక్కుకోగలిగేది. ఈ విషయం సీనియర్ పొలిటీషన్ అయిన చంద్రబాబుకి తెలియదా? అందుకే, ఆయన రాష్ట్రంలో బీజేపి మద్దతు ఎంత మాత్రం అవసరం లేకున్నా సహనం వహిస్తున్నట్టు కనిపిస్తోంది. చూడాలి మరి… ముందు ముందు… అమిత్ షా ఆంధ్రాలో వచ్చే కొన్ని ఎమ్మెల్యే సీట్ల కోసం టీడీపీ లాంటి బలమైన పార్టీ భాగస్వామ్యం వద్దనుకుంటారా? ఎన్డీఏకు చేటు తెచ్చుకుంటారా? అలాంటి తెలివి తక్కువ పని చేసేటంత ఆవేశపరుడా… మన గుజరాతీ అమిత్ షా భాయ్? అన్నిటికి రాబోయే కొన్ని నెలల్లోనే సమాధానం తెలుస్తుంది!