తెలంగాణ రాజకీయాల్లో ‘షా’నా మార్పులు రానున్నాయా?

 

షా వచ్చాడు. బీజేపి కార్యకర్తలకి హుషారు పుట్టించాడు. చంద్రబాబుతో కలిసి ఆంధ్రాలో కాలుమోపాడు. బీజేపి జాతీయ అధ్యక్షుడి తెలంగాణ టూర్ ఇంతే అనుకున్న వారికి కేసీఆర్ ప్రెస్ మీట్ కొత్త జోష్ తీసుకొచ్చింది. ఎవరో టీఆర్ఎస్ లీడర్లు టీవీ కెమెరాల ముందుకొచ్చి బీజేపిని నాలుగు మాటలు అనేసి ఊరుకుంటారనుకున్న అందరికీ … ఏకంగా కేసీఆర్ గొంతు సవరించుకుని విరుచుకపడటం… ఆశ్చర్యమే కలిగించింది! ఎందుకంటే, దేశంలో బీజేపి అతి పెద్ద పార్టీ కావచ్చు. తెలంగాణలో మాత్రమే కమలం 5సీట్లకు పరిమితం. అవి కూడా హైద్రాబాద్ నగరంలోనే. కాని, పెద్దగా పట్టు లేని బీజేపిని ఉద్దేశించి కేసీఆర్ అంతటి నేత కౌంటర్ ఇవ్వటం … రాబోయే ఎన్నికల ముఖచిత్రం ఆవిష్కరిస్తోంది!

 

అమిత్ షా లక్ష కోట్లు కేంద్రం తెలంగాణకు ఇచ్చిందంటే .. కేసీఆర్ లెక్కలు చెప్పి మరీ పిచ్చి లెక్కలు మానండి హెచ్చరించాడు. కాని, వెంటనే షా కూడా తనవైన లెక్కలు జనం ముందు పెట్టాడు. అక్షరాలా లక్ష కోట్లు మోదీ సర్కార్ తెలంగాణకు ఇచ్చిందని నిరూపించే ప్రయత్నం చేశారు. అయితే, ఇలాంటి మాటల తూటాలకు రెండ్రోజుల కన్నా ఎక్కువ విలువ వుండదు. అందరూ మరిచిపోయేవే. కాని, ఇక్కడ అసలు గుర్తించాల్సిన కీలక పరిణామం ఏంటంటే… అమిత్ షా, మోదీల టార్గెట్ తెలంగాణ సీఎం కుర్చీ కోసం కాదు. కేసీఆర్ లాంటి ఉద్యమ నేత సారథ్యంలో టీఆర్ఎస్ బలంగా వుండగా రాత్రికి రాత్రి అధికారం రాదని వారికీ కూడా తెలుసు. అయినా కూడా తెలంగాణలో అధికారం మాదేనంటూ పోరాడటమే రాజకీయం. అందులో సాధ్యాసాధ్యాలు భవిష్యత్తే తేలుస్తుంది. కాని, అమిత్ షా ప్రస్తుత ప్రాథమిక లక్ష్యం కేసీఆర్ చేత కాంగ్రెస్ కంటే ఎక్కువ విమర్శలు చేయించుకోవటం! ఆ పనిలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి!

 

తెలంగాణలో బీజేపి ఆవిర్భావం నుంచీ అప్రస్తుత పార్టీనే. పెద్దగా ప్రభావితం చేసిన సందర్భాలంటూ ఏమీ లేవు. టీడీపీ భాగస్వామిగా కూడా ముద్రపడిపోయింది. కాబట్టి ముందు అమిత్ షా టీఆర్ఎస్ ను ఢికొట్టే ధీటైన పార్టీగా కమలాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు మనం భావించవచ్చు. అందుకే, ఆయన టీ టూర్ లో భాగంగా గులాబీని పదే పదే విమర్శించి సీఎంకి ఆగ్రహం తెప్పించారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ కి ఇచ్చే రేంజ్లో కేసీఆర్ బీజేపికి కౌంటర్ ఇచ్చారు. ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగితే కమలం, గులాబీల పరస్పర ఎటాక్, కౌంటర్ ఎటాక్ లతో కాంగ్రెస్ ఆరటిపండు అవ్వాల్సి వస్తుంది. అప్పుడు రాబోయే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోకున్నా ప్రధాన ప్రతిపక్ష హోదా పొందవచ్చు. కేవలం 5గురు ఎమ్మేల్యేలు హైద్రాబాద్ లో మాత్రమే వున్న బీజేపికి అది కూడా చాలా పెద్ద విజయమే అవుతుంది!

 

అమిత్ షా టూర్ తరువాత ఓవైసీ కూడా నోరు విప్పాడు. హైద్రాబాద్ ను వశం చేసుకుంటామంటోన్న షా స్వయంగా తనతో పోటీ పడాలని మాస్ మసాలా పొలిటికల్ సవాల్ విసిరాడు. అది జరగక్కపోయినా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపిల హోరాహోరి పోరు భాగ్యనగరంలో తప్పక పోవచ్చు. అమిత్ షాకి కావాల్సింది కూడా అదే! మిగతా సెక్యులర్ పార్టీల కన్నా ఎంఐఎం తమ మీద ఎంత రెచ్చిపోతే కాషాయదళానికి వ్యవహారం అంతే ఈజీ! సో… మొత్తానికి అమిత్ షా టూర్ తరువాత అర్జెంట్ గా తేరుకుని వ్యూహం పన్నాల్సిన పార్టీ ఏదైనా వుందంటే అది తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో వున్న కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే ఎక్కువగా హస్తం పార్టీ బీజేపి తట్టుకుని నిలబడాల్సిన అవసరం రావచ్చు!