తెలంగాణపై కమలం కన్నేయడానికి అసలు కారణమేంటంటే?

 

2014 నుంచి మోదీ, అమిత్‌ షా ద్వయానికి దేశంలో ఎదురేలేదు. ఉత్తరభారతంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలనే కాదు, యూపీలో ప్రాంతీయ పార్టీలనూ పెకలించివేసింది. ఇప్పటివరకు 13 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. కానీ దక్షిణాదిలో మాత్రం ఒక్కదాంట్లోనూ పవర్‌లో లేదు. అందుకే సౌత్‌పై ఎప్పుడూలేనంతగా కాన్‌సన్‌ట్రేట్ చేసింది. దక్షిణాదిలో, అందులోనూ తెలంగాణపై అమిత్‌ షా ఫోకస్‌ పెట్టడానికి చాలా కారణాలున్నాయి. కమలం వికసించడానికి ఇక్కడ చాలా అవాశముుందని ఆ పార్టీ నేతలు అంచనాకి వచ్చారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే బీజేపీ ప్రధాన ఉద్దేశం కాదు, కేంద్రంలోనూ ఈ రాష్ట్రం నుంచి కమలానికి ఎక్కువ బలం కావాలని అమిత్‌ షా తలపోస్తున్నారు.

 

దక్షిణాదిపై బీజేపీ దృష్టిపెట్డడానికి అసలైన కారణం మరొకటి ఉంది. 2014లో మెజార్టీ ఎంపీ స్థానాలను గెలిచింది ఉత్తరాదిలోనే. కానీ 2019లో ఈ స్థానాల్లో ఎన్ని నిలబెట్టుకుంటుంది అన్నది అనుమానమే. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏదోక స్థాయిలో తప్పకుండా ఉంటుంది. అప్పుడు కేవలం ఉత్తరాది మీదే ఆధారపడితే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అందుకే దక్షిణాదిలో బలం పెంచుకోవడం కాషాయదళానికి అనివార్యం. అందుకే మిషన్ 7‌ను ప్రారంభించింది బీజేపీ.  ఇందులో తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు, కేరళతో పాటు ఒడిషా, వెస్ట్‌ బెంగాల్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా ప్లాన్ చేస్తోంది బీజేపీ. అయితే ఈ ఏడు రాష్ట్రాల్లో అన్నింటి కంటే కమలానికి మెరుగ్గా కనిపిస్తున్న ఏకైక స్టేట్‌ తెలంగాణ.

 

తెలంగాణలో, అందులోనూ హైదరాబాద్‌లో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. గ్రేటర్‌లో సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. గతంలో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు గెలవడంతో, అక్కడా బీజేపీకి కాస్త పట్టుంది. మహబూబ్ నగర్ నుంచి గతంలో బీజేపీ నుంచి గెలుపొందిన జితేందర్ రెడ్డి, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నా, అక్కడ క్యాడర్‌ పటిష్టంగానే ఉంది. నిజామాబాద్ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణకు ఇప్పటికీ నిజామాబాద్‌లో పట్టుంది. హైదరాబాద్ తర్వాత బీజేపీ కీలకంగా భావిస్తున్న స్థానాల్లో మెదక్ లోక్‌సభా నియోజకవర్గం. ఆ పార్టీ నేతగా అలె నరేంద్ర పోటీ చేయడంతోపాటు ఎంపీగా గెలుపొందారు.

 

తెలంగాణలో తమకు అవకాశాలు మెండుగా ఉన్నాయని భావించడానికి బీజేపీ చాలా అంశాలను చూపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ డీలాపడుతోంది. టీడీపీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. దాని ఓట్లు కూడా తమకే పడతాయనుకుంటోంది. మోదీ అభివృద్ది మంత్రంతో టీఆర్ఎస్‌కు ధీటుగా నిలబడగల పార్టీ తమదేనని భావిస్తోంది కమలం. కేసీఆర్ కుటంబ పాలనను ఎత్తిచూపుతామని, రైతులు, విద్యార్థులు, ఉద్యోగుల్లో కేసీఆర్ పట్ల వ్యతిరేకతను తమవైపు మళ్లించుకుంటామని అనుకుంటోంది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి విజయం సాధించాలనుకుంటోంది. మరి అమిత్‌‌షా ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందా? కమలం నేతల ఆశలు నెరవేరతాయో లేదో చూడాలి.