అమిత్‌‌షా, రాహుల్‌ టూర్లపై టీఆర్‌ఎస్‌ సర్వే... ఏం తేలిందంటే?

 

తెలంగాణలో సాధారణ ఎన్నికలకు మరో 23 నెలల గడువే మిగిలి ఉంది. దాంతో సమయం దగ్గర పడుతున్నకొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఇప్పటికే తెలంగాణలో పర్యటిస్తుండగా, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పది రోజుల వ్యవధిలో తెలంగాణకి రానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరి పర్యటనలూ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చాలా రోజుల తర్వాత రాష్ట్రానికి వస్తున్న రాహుల్‌గాంధీ జూన్‌ 1న సంగారెడ్డి బహిరంగ సభలో పాల్గోనున్నారు.

 

అమిత్‌‌షా, రాహుల్‌... ఇద్దరి టార్గెట్టూ టీఆర్‌ఎస్‌ పార్టీయే అయినా.... గులాబీ బాస్‌ మాత్రం ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014 తర్వాత పార్టీ బలోపేతానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకున్న టీఆర్ఎస్... కలిసి వచ్చిన అందరి నేతలను పార్టీలో చేర్చుకుంది. 75 లక్షల మంది టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్నారు. అంతేకాదు పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్ఠపరిచేందుకు నియోజకవర్గ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. పార్టీ ప్లీనరీ, ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. అయితే అమిత్‌షా, రాహుల్‌లు... టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయడంతో ఏ స్థాయిలో ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికి సర్వేలు చేయిస్తోంది.

 

అమిత్‌‌షా, రాహుల్‌ పర్యటనల ప్రభావాన్ని సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తోంది టీఆర్‌ఎస్‌. అందుకే అమిత్‌ షా, రాహుల్‌ పర్యటించే ప్రాంతాల్లో జనం నాడిని తెలుసుకోవాలని సర్వే సంస్థలకు టీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించింది. పార్టీ శ్రేణులు సైతం పరిస్థితులను సూక్ష్మంగా గమనించాలని, జనాభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అసంతృప్తులను విపక్షాలు తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని, వీటిపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించింది. అయితే అమిత్‌షా పర్యటిస్తోన్న నల్గొండ జిల్లాలో, రాహుల్‌ పర్యటించనున్న సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ బలంగా ఉందని, బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు పర్యటించినా తమకేమీ ఢోకా ఉండదని గులాబీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.