ఇతర పార్టీల్ని డ్యామేజ్ చేసేందుకొచ్చిన షా… స్వంత పార్టీ రిపెయిర్ ని గుర్తించారా?

 

బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టూర్ తెలంగాణలో టైం టేబుల్ ప్రకారం జరిగిపోతోంది. కాని, అందరూ ఊహించినట్టు ఏ పార్టీ నుంచీ కాషాయదళంలోకి వలసలు మాత్రం కనిపించ లేదు. మరీ ముఖ్యంగా, షా నల్గొండలో పర్యటిస్తోంటే కోమటిరెట్టి బ్రదర్స్ కదలికలే కనిపించలేదు. వారిద్దరూ కాంగ్రెస్ గూటి నుంచి బీజేపి కొమ్మలపై వాలతారని తీవ్రంగా ప్రచారం జరిగింది. అంతే కాదు, టీ టీడీపీలోని ఆర్ . కృష్ణయ్య లాంటి నేతలు కూడా పురంధేశ్వరి లాంటి నాయకులతో భేటీ అయ్యి కలకలం రేపారు. కాని, తీరా కమల రథసారథి వచ్చాక మాత్రం బ్రేకింగ్ న్యూస్ లు ఏం లేకుండా పోయాయి? ఇలా ఎందుకు జరిగింది?

 

అమిత్ షా ప్రస్తుత పర్యటనలో టీ టీడీపీ, టీ కాంగ్రెస్ , వీలైతే టీఆర్ఎస్ లకు షాక్ ఇవ్వాలిన కాషాయ దళం భావించింది. అందుకు తగ్గట్టే మీడియాకి లీకులిస్తూ హడావిడి జరిగింది. కాని, చివరి నిమిషంలో స్వయంగా అమిత్ షానే ఇప్పుడప్పుడే చేరికల కోలాహలం వద్దన్నారని టాక్! ఇందులో నిజం ఎంతో మనకు తెలియదుగాని అమిత్ షా దృష్టి మాత్రం టీ బీజేపీ నేతల అంతర్గత కుమ్ములాటలపై పడిందన్నది క్లియర్.

 

వాజ్ పేయ్ ప్రధానిగా వున్నప్పుడు ఒక వెలుగు వెలిగిన తెలుగు బీజేపి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ అంతంత మాత్రంగానే వుంది. అయితే, ఉత్తరాదిని ఎలాగో పిడికిట పట్టిన కమల దళం ఎలాగైనా దక్షిణాదిలో ఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది. కర్ణాటక తరువాత ఆ పార్టీ సీరియస్ గా టార్గెట్ చేస్తోంది తెలంగాణనే. ఎందుకంటే, ఏపీలో మిత్ర ధర్మం కొద్దీ టీడీపీపై ఇప్పుడప్పుడే బహిరంగా పోరాటం చేయలేని స్థితి. అలాగే, తమిళనాడులో పూర్తిగా రజినీకాంత్, పన్నీర్ సెల్వం లాంటి వారి మద్దతు కావాలి. కేరళలో అయితే విజయం చాలా చాలా దూరంలో వుంది. అందుకే, ఎంఐఎం లాంటి ప్రత్యర్థి వున్న తెలంగాణలో తమకు బలపడే అవకాశాలు పుష్కలంగా వున్నాయని భావిస్తోంది దిల్లీ బీజేపి. కాని, తీరా తెలంగాణకు వచ్చిన అమిత్ షాకి ఇక్కడి లోకల్ సీన్ అర్థమయ్యి బాగా డిజపాయింట్ అయ్యారట!

 

జాతీయ అధ్యక్షుడి మనస్తాపానికి కారణం… తెలంగాణ బీజేపీలో గ్రూపులు గ్రూపులుగా విడిపోయిన లీడర్లే! కిషన్ రెడ్డి, దత్తాత్రేయ ఒక వర్గం అని కొందరంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కి వారితో పడటం లేదని టాక్. ఇక తెలుగు దేశంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాగం జనార్దన్ రెడ్డి బీజేపీలో పూర్తిగా ఆగమైపోయారు. ఆయనతో కూడా కొందరు సీనియర్ బీజేపి నేతలకి పొసగటం లేదట. ఇక వీరందరి మధ్యలో ఓల్డ్ సీటీలో ఫ్రైర్ బ్రాండ్ హిందూత్వ లీడర్ గా ఎదిగిన రాజా సింగ్ ది మరో దారి! ఆయనకు కూడా చాలా మంది తెలంగాణ సీనియర్ బీజేపీ నేతలతో కయ్యమేనట! ఇవన్నీ కన్ ఫర్మ్ చేయటానికి ఎవ్వరూ నోరు విప్పటం లేదు కాని… అందరి మధ్యా లుకలుకలు వున్నాయని మాత్రం షా గ్రహించేశారు. అందుకే, కొత్త వార్ని వలస తెచ్చుకునే ముందు పాత వార్ని దారిలోకి తెచ్చుకుందామని ఆయన భావించారంటున్నారు కార్యకర్తలు.

 

నల్గొండలో సభ జరుగుతోంటే వేదిక మీదకి కిషన్ రెడ్డి వెళ్లలేదు. జాతీయ అధ్యక్షుడు అక్కడే ఈ మాజీ రాష్టర అధ్యక్షుడు కిందనే వుండిపోయారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న అమిత్ షా తరువాత కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చించారట. హైద్రాబాద్ వచ్చి ఫ్లైట్ ఎక్కేలోపు మిగతా బీజేపి గ్రూపులతోనూ ఆయన మాట్లాడి స్ట్రాంగ్ వార్నింగ్ లాంటి మెసేజ్ ఇవ్వొచ్చంటున్నారు. దాని సంగతి ఎలా వున్నా, కేసీఆర్ లాంటి నాయకుడి చేతిలో గుభాళిస్తోన్న గులాబీని ఎదుర్కోవటం… అంతర్గత కయ్యాలతో సతమతం అవుతూ వుంటే…  కమలానికి మాత్రం చాలా కష్టం! కాబట్టి ముందు ఇన్నర్ రిపెయిర్ ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది!