అమితాబ్లాంటి భర్తే కావాలి

 

జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఘట్టం పెళ్లి. పెళ్లిలో దక్కిన జీవితభాగస్వామి కనుక సరైనవాడైతే జీవితం పల్లకీలో సాగిపోతుంది. లేకపోతే తల్లకిందులైపోతుంది. అందుకే తమతో కలిసి నడవబోయేవారు ఎలా ఉండాలనే విషయం మీద ప్రతి ఒక్కరికీ బోలేడు ఆశల ఉంటాయి. భారత్ మేట్రిమోనీ సంస్థ ఈ ఆశలు ఏ తీరుగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది.

 

- ఫేస్బుక్, ట్విట్టర్ వేదికగా సాగిన ఈ సర్వేలో 1500 మంది పాల్గొన్నారట. వీరిలో 37 శాతం మగవారు కాగా 63 శాతం స్త్రీలు కావడం గమనార్హం. పైగా తమకి ఎలాంటి వధువు/ వరుడు కావాలో ఎవరన్నా హీరోతోనో హీరోయిన్తోనో పోలుస్తూ చెప్పమంది ఈ సంస్థ. ఆ సర్వేలో తేలిన విషయాలు ఏమిటంటే...

 

- ఓ పదిహేనేళ్ల క్రితం దుమారంలా దూసుకువచ్చిన హృతిక రోషన్ ప్రస్తుతం ఫ్లాప్లతో సతమతం అవుతూ ఉండవచ్చుగాక. భార్య సుసాన్ నుంచి దూరం కావడం, మాజీ ప్రేయసి కంగనాతో గొడవలు పడటంలాంటి సమస్యలు సరేసరి! అయినా తమకు కాబోయే భర్త హృతిక్లాగా అందంగా ఉండాలంటూ ఏకంగా 70 శాతం మంది స్త్రీలు కోరుకున్నారట.

 

- జీవితభాగస్వామి అందంగా ఉంటే సరిపోదు కదా! నిజాయితీగా కూడా ఉండాలిగా! అందుకే 55 శాతం మంది స్త్రీలు తమకు కాబోయే భర్త షారుక్ ఖాన్ అంత నిజాయితీగా ఉండాలని కోరుకున్నారట. షారూక్ నటించిన పాత్రలు చూసే ఈ మాట అన్నారో లేకపోతే ఆయన వ్యక్తిత్వాన్నే గమనించారో కానీ... ఆడవారిలో అధికశాతం ఆయనకే ఓటు వేశారు. నిజాయితీలో షారుక్ తరువాత స్థానాలని అజయ్ దేవగన్ (30 శాతం), ఎం.ఎస్.ధోనీ (15 శాతం) అందుకున్నారు.

 

- నిజాయితీ సంగతి అలా ఉంచితే మీకు ఎవరిలా కష్టపడే వ్యక్తి భర్తగా రావాలి అన్న ప్రశ్నకు విరాట్ కోహ్లీ, అక్షయ్ కుమార్లాగా కష్టపడే భర్త కావాలని కోరుకుంటున్నారట. ఈ రంగంలో వీరిద్దరికీ చెరో 25 శాతం ఓట్లు దక్కాయి.

 

- ఇక 70వ ఒడిలో పడినా బాలీవుడ్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నా అమితాబ్ ఈ జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు. అది కూడా రెండు సందర్భాలలో! ఇతరులను గౌరవంగా చూడటంలో ఎలాంటి భర్తని కావాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు 50 శాతం మంది అమితాబ్కే ఓటు వేశారు. అంతేకాదండోయ్... ఇతరులను అర్థం చేసుకోవడంలో ఎలాంటి భర్త కావాలనుకుంటున్నారని అడిగినప్పుడూ ఇదే పరిస్థితి.

 

- స్త్రీల సంగతి అలా ఉంచితే.... యువకులు మాత్రం తమకు కావల్సిన స్త్రీ అచ్చు ‘ద్రష్టీ ధమీ’లా ఉండాలని కోరుకున్నారట. ఈ ద్రష్టీ ధమీ ఎవరో తెలుగువారికి అంతగా తెలియకపోవచ్చు. కానీ హిందీ నుంచి డబ్బింగ్ చేయబడిన మధుబాల సీరియల్లో హీరోయిన్గా ద్రష్టీ ధమీ తెలుగు తెరలకి పరిచయమే!

 

అదీ విషయం! మీ భర్తలో ఎలాంటి గుణాలు కావాలో ఎవరో ఒక తారతో పోల్చి చూపించండి అని అడిగినప్పుడు బయటపడిన నిజాలివి. మిగతా సర్వేలకు విభిన్నంగా ఉంది కాబట్టే దీనిని దాదాపు రెండుకోట్ల మంది వీక్షించారని భారత్ మాట్రిమోనీ సంస్థ చెప్పుకొస్తోంది.    

- నిర్జర.