అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతం?
Published on: Mon Aug 22, 2022 12:05PM
అమిత్ షా తెలంగాణ పర్యటన మునుగోడులో ఆయన ప్రసంగం కంటే.. ఆ సభ తరువాత ఆయన భేటీ అయిన వ్యక్తుల కారణంగానే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ వ్యూహం, ఏ ఎత్తుగడతో అమిత్ షా రాజకీయాలతో సంబంధం లేని ఆ ఇరువురు వ్యక్తులనూ కలుసుకున్నారన్న చర్చ ఉభయ తెలుగురాష్ట్రాలలోనూ జోరుగా సాగుతోంది.
మొత్తం మీద అమిత్ షా పర్యటన ప్రధాన ఉద్దేశం మునుగోడు సభ ద్వారా బీజేపీ సత్తాను చాటాలన్నదే అయినా.. ఆయన సభతరువాత కలుసుకున్న వ్యక్తుల కారణంగా మునుగోడు కంటే బీజేపీ ఆ తరువాత జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించిందన్న సంగతి స్పష్టమైందని పరిశీలకులు అంటున్నారు. ముందు అమిత్ షా ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావుతో భేటీ అయ్యారు.
అనంతరం ప్రముఖ నటుడు జూనిరయ్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఈ రెండు భేటీలూ కూడా స్వయంగా అమిత్ షా చొరవతో జరిగిన భేటీలే కావడం గమనార్హం. ఈ రెండు భేటీలూ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎడతెగని చర్చలకు కారణమయ్యాయి. త్వరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటం, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకు వస్తుండడంతో ఈ భేటీలకు ఎనలేని రాజకీయ ప్రాధాన్యత ఎర్పడింది.
పరిశీలకులు మాత్రం తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులను బీజేపీ వైపునకు ఆకర్షించే వ్యూహంలో భాగంగానే అమిత్ షా రామోజీరావు, ఎన్టీఆర్ లతో భేటీ అయ్యారని విశ్లేషిస్తున్నారు. ఏపీకి రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ కూడా కారణమేనన్న ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులలో కూడా ఉందనీ, దానికి తగ్గించి వచ్చే ఎన్నికల నాటికి సీమాంధ్రులను తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో భాగంగానే అమిత్ షా రామోజీ, ఎన్టీఆర్ లతో భేటీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు.
అందుకే సెటిలర్లను ప్రభావితం చేసేంతగా ప్రజలలో ఆకర్షణ ఉన్న రామోజీరావు, జూనియర్ ఎన్టీఆర్ లను అమిత్ షా కలిశారని పేర్కొంటున్నారు. రామోజీరావుతో భేటీ కారణంగా సీమాంధ్రుల ఆగ్రహం ఏదో మేరకు చల్లారుతుందని అమిత్ షా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం తరఫున ప్రచారం చేసిన తరువాత ఇప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా పూర్తిగా సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించారు.
అటువంటి ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ అమిత్ షా డిన్నర్ సమావేశంలో బేటీ కావడం సర్వత్రా ఆసక్తి కలిగించింది. అమిత్ షా ఆయనను బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారని వార్తలు వచ్చినా అవేవీ ధృవపడలేదు. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో ఎన్టీఆర్ ప్రచారం చేయటం.. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తి గా తన ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలోనే చెప్పిన నేపథ్యంలో.. ఆయన బీజేపీలో చేరే ఛాన్సులు ఇసుమంతైనా లేవని అంటున్నారు. అలాగే కనీసం తెలుగుదేశం తెలంగాణ సారథ్య బాధ్యతలు తీసుకుంటే.. ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ సహకారం ఇస్తుందనీ, తెలంగాణలో బీజేపీకి తెలుగుదేశం మద్దతు ఇస్తుందని అమిత్ షా ఎన్టీఆర్ కు ప్రతిపాదించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే అధికారికంగా ఈ వార్తలను అటు తెలుగుదేశం కానీ, ఇటు బీజేపీ కానీ దృవీకరించలేదు. కానీ మొత్తం మీద ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో రానున్న రోజులలో రాజకీయ సమీకరణాలలో మార్పును సూచిస్తోందని మాత్రం పరిశీలకులు గట్టిగా చెబుతున్నారు.


