అమిత్ షా హైదరాబాద్ పర్యటన: గులాబీ పార్టీతో కాషాయం చెలిమి సూచన.?
Published on: Tue Nov 3, 2026 4:14AM

తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన బీజేపీ, బీఆర్ఎస్ మైత్రిపై సరికొత్త చర్చకు తెరలేపింది. అమిత్ షా హైదరాబాద్‌లో సోమవారం (నవంబర్ 2) నిర్వహించిన మహా పాదయాత్ర, భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగం కమలం, గులాబీ పార్టీల పొత్తు చర్చలకు ఆస్కారం ఇచ్చింది. అమిత్ షా తన ప్రసంగంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాలనా తీరును తప్పుపడుతూ, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలయ్యాయని ధ్వజమెత్తారు.
తెలంగాణను కొందరు ఢిల్లీ పెద్దలకు ఏటీఎంలా రేవంత్ మార్చేస్తున్నారని తూర్పారపట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కేవలం బీజేపీ మాత్రమే రాష్ట్రానికి నిజమైన ప్రత్యామ్నాయంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలను కూడా అమిత్ షా గట్టిగా తిప్పికొట్టారు. ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తప్పుపడుతూ, ఒకవేళ ఈవీఎంలు లోపభూయిష్టంగా ఉంటే తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎలా అధికారంలోకి వచ్చాయని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిస్తే ప్రజల తీర్పని, ఓడిపోతే ఈవీఎంల తప్పు అనడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందన్నారు.
అయితే ఇక్కడో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా అధికార పగ్గాలు చేపట్టే బలం కమలం పార్టీకి లేదన్న అంచనాతోనే ఆయన గులాబీ పార్టీపై విమర్శల పదును తగ్గించి ఆ పార్టీతో చెలిమికి తలుపులు తెరిచి ఉంచారని అంటున్నారు. అమిత్ షా మొత్తం ప్రసంగంలో గులాబీ పార్టీ ప్రస్తావన నామమాత్రంగానే ఉండటంతో.. గతంలో అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేసిన అవినీతి, అరాచకం, దుర్మార్గాలు అన్న విమర్శలను ఉపసంహరించుకున్నట్లేనా అన్న చర్చ రాష్ట్రంలో జరుగుతోంది.
[Amit Shah Hyderabad Tour, Mahapadayatra, Criticise, Congress, Politics, Softcorner, Brs, Telangana Politics, Telugu One]


