TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమిత్‌షా దళిత "భజన"..!

Published on: Sat Jul 9, 2016 12:44PM

పాలనను పరుగులు పెట్టించే లక్ష్యంతో ఇటీవల కేంద్ర మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు ప్రధాని నరేంద్రమోడీ. అచ్చం అలాగే పార్టీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశంలో పెద్ద ఎత్తున ఉన్న దళితుల ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకునే ప్రణాళిక రెడీ చేస్తున్నారు అమిత్. దానిలో భాగంగా పార్టీ అంతర్గత విభాగాలు, కార్యవర్గంలో దళితులకు, వెనుకబడిన వర్గాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు.

 

తమ ప్రభుత్వం పేదలు, వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తున్నట్లు మోడీ చెబుతున్నారని, అది పార్టీ వ్యవస్థ కూర్పులోనూ ప్రతిఫలించాలని భావిస్తున్నారు. ఆఫీస్ బేరర్ల బృందంలో కీలకమైన ప్రధాన కార్యదర్శుల స్థానాలు కొన్ని ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శులుగా దళితులెవరూ లేరు. ఇందుకు అనుగుణంగానే అయా స్థానాల్లో దళితులకు పెద్ద పీట వేయాలని అమిత్‌షా ప్రణాళికలు రచిస్తున్నారు.

 

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అధికారం దక్కించుకుంటే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తమ ప్రభావం బలంగా చూపించవచ్చన్న ఆలోచనతో బీజేపీ అధినాయకత్వం ఉంది. యూపీలో అధికారంలోకి రావాలంటే దళితుల మద్ధతు తప్పనిసరి దీనిని గ్రహించిన అమిత్ తన పని మొదలెట్టారు. మే నెలలో ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పర్యటించిన అమిత్‌షా సేవాపురి అనే గ్రామంలో గిరిజాప్రసాద్ బింద్, ఇక్బాల్ బింద్ అనే దళిత దంపతుల ఇంట్లో భోజనం చేశారు. ఇప్పుడు ఇదే బాటలో పార్టీ పదవుల్లోకి దళితులను నియమించి వారి మెప్పును పొందాలనుకుంటున్నారు.