TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రాజీవ్ గాంధీపై మోదీ వ్యాఖ్యలు.. ఈసీకి రక్తంతో లేఖ

Published on: Wed May 8, 2019 3:59PM

 

ఇటీవల యూపీలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీని ఆయన అనుచరులంతా మిస్టర్ క్లీన్‌గా అభివర్ణించేవారని.. కానీ చివరకు ఆయన నెంబర్ వన్ అవినీతిపరుడయ్యారని వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ అవినీతిపరుడంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. మోదీపై విమర్శలు వెల్లువెత్తాయి, పలువురు నేతలు మోదీ తీరుని తప్పుపట్టారు.

రాజీవ్‌ పై మోదీ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయంటే.. ఓ వ్యక్తి ఏకంగా ఎన్నికల సంఘానికి రక్తంతో లేఖ రాశాడు. తాజాగా ఎన్నికల సంఘానికి అమేథీ నుంచీ ఓ లేఖ అందింది. ఆ లేఖలోని అక్షరాలు రక్తంతో రాసి ఉన్నాయి. ప్రధాని మోదీ.. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలనీ, నోటికొచ్చినట్లు అభ్యంతరకరంగా మాట్లాడితే.. తమ మనోభావాలు దెబ్బతింటాయన్నది ఆ లేఖ సారాంశం.

అమేథీలోని షాఘార్‌ ప్రాంతానికి చెందిన మనోజ్ కశ్యప్.. ఆ లేఖను ఈసీకి పంపాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల తాను తీవ్ర ఆవేదన చెందినట్లు అతను లేఖలో పేర్కొన్నాడు. రాజీవ్ గాంధీ ఈ దేశంలో యువత ఓటు వేసే వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని, పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకొచ్చారని, కంప్యూటర్ విప్లవాన్ని తెచ్చారని లేఖలో గుర్తుచేశాడు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సైతం రాజీవ్ గాంధీని మెచ్చుకున్నారన్న మనోజ్.. రాజీవ్ గాంధీని ఎవరు అవమానపరిచినా వాళ్లు ఆయన్ని హత్య చేసిన వారితో సమానం అని లేఖలో పేర్కొన్నాడు. రాజీవ్ గాంధీ అమేథీ ప్రజలు, దేశ ప్రజల హృదయాల్లో జీవించి ఉన్నారన్న మనోజ్ కశ్యప్.. ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకుండా ప్రధాని మోదీకి ఆదేశాలు ఇవ్వాలని లేఖలో ఈసీని కోరాడు.