TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ట్రంప్‌ అధ్యక్షుడైతే..ప్రపంచానికి నష్టమేనా..?

Published on: Sat May 14, 2016 5:36PM

 

ప్రజంట్ అమెరికాలో ఎన్నికల హీట్ ఓ రేంజ్‌లో ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీ కాలం త్వరలో ముగిసిపోనుంది. ఒబామా రెండు విడతలు అధ్యక్షుడిగా పనిచేసినందున అక్కడి రాజ్యాంగం ప్రకారం మూడవసారి అధ్యక్ష పదవికి పోటీ చేయరాదు. దీంతో ఆయన వారసుడు ఎవరా? అని ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఒబామా డెమోక్రాటిక్ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ నుంచి బిజినెస్ టైకూన్ డోనాల్డ్ ట్రంప్‌లు శ్వేత సౌధాన్ని అధిరోహించేందుకు బరిలో నిలిచారు. వీరిద్దరిలో హిల్లరి విదేశాంగమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తన ప్రవర్తన ద్వారా అటు అమెరికాలోనూ ఇటు ప్రపంచ వ్యాప్తంగానూ ఆమె జనాదరణ పొందారు. కాని ట్రంప్‌పై మాత్రం ప్రపంచం కలవరపడుతోంది. అతడు దుర్మార్గుడు, ప్రపంచాన్ని బతకనివ్వడు. మరి అలాంటి వాడు అగ్రరాజ్యాధినేత అయితే ప్రపంచ వినాశనం తప్పదు అని మేధావులు భయపడుతున్నారు.

 

రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఇంకా ప్రకటన రాక ముందే ట్రంప్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, చేస్తున్న వ్యాఖ్యలు అమెరికన్లనే కాకుండా ప్రపంచదేశాలను కూడా కలవరపరుస్తున్నాయి. ఆయన ఎప్పుడు ఏ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారో అంతు పట్టకుండా ఉంది. ఒకసారి నోరు జారడం..వెంటనే నాలుక కరుచుకోవడం ట్రంప్‌కు అలవాటైపోయింది. భారతీయులు తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని అనేశాడు. విమర్శలు వచ్చేసరికి భారతన్నా, భారతీయులన్నా తనకి గౌరవమని, స్నేహ సంబంధాలు కొనసాగిస్తామన్నారు. ముస్లింల గురించి దారుణమైన పదజాలంతో వ్యాఖ్యానించారు. ముస్లింలను దేశంలోకి రానివ్వరాదన్నది తన విధానమని ఆయన చెప్పారు. ఇదీ వివాదంగా మారడంతో మళ్లీ సరిదిద్దుకునే బాట పట్టారు. ముస్లింలను దేశంలోకి రానివ్వరాదన్నది కేవలం సూచన అని, అయినా అది తాత్కాలికమే అని ట్రంప్ అన్నారు. ఇలా అర్థంలేని వాదనలు..పొంతన లేని వ్యాఖ్యలతో నవ్వుల పాలయ్యాడు..అవుతూనే ఉన్నాడు.

 

ఇలా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తుండటంతో సొంతపార్టీ వాళ్లే ఈయనెందుకు దేవుడోయ్...ఇతడి వల్ల మనం అయిపోతాం..అనుకునే పరిస్థితి. కాని ట్రంప్‌ని ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? ఆయన్ని నిలువరించే శక్తి ఎవ్వరికి లేదు అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. పూర్వ రాజకీయ అనుభవం అంతగా లేకపోయినప్పటికీ అంగబలం, అర్థబలం పుష్కలంగా ఉన్న ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పలు రాష్ట్రాల్లో ప్రతినిధుల ఎన్నికల్లోనూ, ప్రైమరీ ఎన్నికల్లోనూ ట్రంప్ ఆధిక్యం సాధిస్తున్నారు. ఆయన ధాటికి తట్టుకోలేక ప్రత్యర్థులు ఒక్కొక్కరే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నారు.

 

ప్రపంచ దేశాలన్నింటిలో అమెరికా స్థానం ప్రత్యేకం. తన అర్థ, అంగ బలంతో ప్రపంచాన్ని కనుసైగతో శాసించగల శక్తి అమెరికా సొంతం. మరి అలాంటి దేశాన్ని పరిపాలించే అధినేతకు లోకం ఎంత భయపడుతుందో అందరికి తెలుసు. ట్రంప్‌లాంటి వ్యక్తికి అగ్రరాజ్యాధినేతగా అవకాశమిస్తే పిచ్చోడి చేతిలో రాయిలా ఎటు వెళ్తుందో తెలియదు. ఇతడు గెలిస్తే దక్షిణ చైనా సముద్రంలో యుద్ధం రావొచ్చు. ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వేరవ్వచ్చు. ముఖ్యంగా మనదేశానికి అతడు మిక్కిలి ప్రమాదకారి. చాలా సందర్భాల్లో ట్రంప్ భారత్‌పై తన అక్కసును వెల్లగక్కాడు. ఇన్ని తెలిసినా ఇలాంటి దురహంకారికే అక్కడి ప్రజలు అధ్యక్ష పీఠం కట్టబెట్టాలని ఎందుకు తపిస్తున్నట్టు.