నాటోకి టాటా అంటున్న ట్రంప్!

 

అమెరికాలో ట్రంప్ టైమ్స్ మొదలవన్నున్నాయి.మరి కొద్ది గంటల్లో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌజ్ లో కాలుమోపుతాడు.ఇది అమెరికా అంతరంగిక వ్యవహారం అని కొట్టిపారేయటానికి అస్సలు వీలు లేదు.ప్రపంచంలోని ఇతర దేశాల అధ్యక్షులు,ప్రధానులు,రాజులు అధికారం చేపట్టినట్టు కాదు అమెరికన్ ప్రెసెడింట్ మారటం అంటే.అది భూగోళంపై పెను ప్రభావం చూపే అత్యంత కీలకమైన పరిణామం.పైగా ఈసారి ట్రంప్ లాంటి టెంపర్ వున్న ప్రెసిడెంట్ ని అమెరికన్స్ ఎంచుకోవటం మరింత ఆసక్తి,ఆందోళన కలిగిస్తోంది!


నథింగ్ అనుకున్న ట్రంప్ మెల్లెమెల్లగా సమ్ థింగ్ అయ్యాడు.ఎన్నికల్లో గెలిచి ఎనీథింగ్ అనిపించుకున్నాడు.ఇప్పుడు అధికారికంగా అధ్యక్షుడు అవ్వనున్న సమయంలో ఎవ్రీథింగ్ అన్నట్టు వ్యవహరిస్తున్నాడు.ఆయనొస్తే ఏదో కొన్ని ఉద్యోగాలు పోతాయిలే అనుకున్న వారు ఇప్పుడు అవాక్కయ్యే నిర్ణయాలు తీసుకుంటున్నాడు.దిమ్మతిరిగిపోయే కామెంట్స్ చేస్తున్నాడు.నిన్న మొన్నటి వరకూ ట్రంప్ అంటే మెక్సికో లాంటి దేశాలు మండిపడేవి.కారణం ఆయన అక్కడి నుంచి వలస వస్తోన్న జనాన్ని టార్గెట్ చేయటమే.మెక్సికో వలస జనాలను రాకుండానైతే,ఏకంగా గోడ కడతానని చెబుతున్నాడు ట్రంప్!కాని,ఆయన ఎక్స్ పరిమెంట్స్ అక్కడితో ఆగటం లేదు. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలకు కూడా మంట పుట్టిస్తున్నాయి... 


అమెరికాలోని కంపెనీలు అమెరికన్స్ కే ముందుగా ఉద్యోగాలు ఇవ్వాలని బెదిరిస్తోన్న ట్రంప్ మిలటరీ విషయాల్లో కూడా దూకుడుగా వెళుతున్నాడు. ఒకప్పుడు అమెరికానే చొరవ చూపి సృస్టించిన నాటో ఇప్పుడు దండగ అనేస్తున్నాడు!నాటో అంటే యూరప్,అమెరికా ఖండాల్లోని వివిధ దేశాల సైనిక కూటమి.ఇరాక్,అఫ్గనిస్తాన్,సిరియా లాంటి అనేక దేశాలపై నాటో సేనలు దాడులు చేశాయి ఈ మధ్య కాలంలో.ఇలా చాలా సార్లు నాటో అమెరికా ఉద్దేశాలకు ఉపయోగపడుతూ వచ్చింది.కాని,ట్రంప్ ఎన్నికల ముందు నుంచే నాటోపై పెదవి విరుస్తున్నాడు.నాటో నిర్వహణ కోసం ఖర్చయ్యే వేల కోట్ల డాలర్లు కేవలం అమెరికానే భరిస్తోందని ఆయన వాదిస్తున్నాడు.మిగతా దేశాలు తక్కువ ఖర్చుతో సైనికంగా లాభాలు, రక్షణ పొందుతున్నాయని ట్రంప్ కంప్లైంట్!


నాటో గురించి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వాదన నిజమే.నాటో కోసం ఎక్కువగా ఖర్చు చేసేది అమెరికానే.కాని,ఇప్పుడు దాన్ని దండగ అంటూ ఒకవేళ అమెరికా అమాంతం పక్కకు తప్పుకుంటే మిగతా దేశాలకు పెద్ద షాకే తగులుతుంది.కెనడా లాంటి దేశాలు ఇప్పటికిప్పుడు తమ రక్షణ బడ్జెట్ ను భారీగా పెంచుకోవాల్సి వస్తోంది.ఇటలీ,జర్మనీ,ఫ్రాన్స్ లాంటి యూరప్ దేశాలు కూడా తమ సేఫ్టీ తాము చూసుకోవాల్సి వస్తుంది.అన్నిటికంటే ముఖ్యంగా,ట్రంప్ నాటో నుంచి వైదొలగాలని నిర్ణయిస్తే అది రష్యాకి పెద్ద లాభం.ఇదే ఇప్పుడు చాలా మందిని ఆందోళన పరుస్తోన్న అంశం...


రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నాటో ఏర్పాటుకు అసలు కారణం సోవియట్ రష్యా.దాన్ని అడ్డుకునేందుకే అమెరికా అనేక దేశాల మద్దతుతో నాటోను సృష్టించింది.కమ్యూనిస్ట్ రష్యాను విజయవంతంగా అడ్డుకుంది.కాని,ఇప్పడు కాలిక్యులేషన్స్ అన్నీ మారిపోయాయి.ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా క్లోజ్.అందుకే,డొనాల్డ్ గత అమెరికన్ ప్రెసిడెంట్ల మాదిరిగా కాకుండా రష్యా అంటే కొత్త ప్రేమ ప్రదర్శిస్తున్నాడు.సిరియా విషయంలో రష్యా జోక్యం చేసుకున్నందుకు విధించిన ఆంక్షలు కూడా అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు.ట్రంప్ ప్రదర్శిస్తోన్న ఈ రష్యన్ లవ్ ఎవ్వరికీ ఓ పట్టాన అంతు పట్టడం లేదు...


ట్రంప్ తాను అనుకున్న విధంగా నాటో నుంచి అగ్ర రాజ్యాన్ని తప్పిస్తే ప్రపంచ సైనిక సమీకరణల్లో పెను మార్పు గ్యారెంటీ.రష్యా ఇప్పటి కంటే ఇంకా దూకుడుగా తన కండ బలం ప్రదర్శించే చాన్స్ వుంది.ఇంతకాలం పెద్దన్న అమెరికాను నమ్ముకుని నిశ్చింతగా వున్న వివిధ నాటో దేశాలు ఇకపై జాగ్రత్తగా తమని తాము కాపాడుకుంటూ ముందుకు సాగాలి.అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంత కాలం కొనసాగుతూ వస్తోన్న అమెరికా సైనిక ఆధిపత్యానికి గండి పడే అవకాశం వుంది!