TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

6,000 కోట్లు- పాకిస్తాన్‌కు అమెరికా సాయం!

Published on: Wed Feb 10, 2016 1:34PM

ఒక పక్క ప్రపంచంలోని ప్రతి తీవ్రవాద చర్యా పాకిస్తాన్‌ వైపు వేలెత్తి చూపించవచ్చుగాక! కానీ అమెరికా, పాకిస్తాన్‌ మీద మండిపడుతున్నట్లు కనిపిస్తూనే కావల్సినప్పుడు కావల్సినంత సాయం చేస్తూనే ఉంటుంది. అందుకు తాజా ఉదహరణగా తీవ్రవాదం మీద ‘పోరాడేందుకు’ అమెరికా 6,000 కోట్ల రూపాయలని పాకిస్తాన్‌కు అందిస్తోంది.  తీవ్రవాదం మీద జరుగుతున్న పోరులో పాకిస్తాన్‌ తన ముఖ్యమైన భాగస్వామి అనీ, అందుకు ప్రతిఫలంగా ఆ దేశానికి ఈ భారీ సాయం అందిస్తున్నామనీ అమెరికా నేతలు చెబుతున్నారు. తీవ్రవాదులు తమ దేశంలోకి చొచ్చుకురాకుండా పోరాడేందుకూ, అలా చేసే పోరాటం కోసం తగిన ఆయుధాలను సమకూర్చుకునేందుకూ అమెరికా ఈ డబ్బుని అందిస్తోందట. ఇలా పాకిస్తాన్‌కి ధనసాయం అందించడం వల్ల పాకిస్తాన్‌లోని తీవ్రవాదం అంతరించిపోయి, భారతదేశంతో సత్సంబంధాలు కూడా ఏర్పడతాయన్నది అమెరికా ఉవాచ. కానీ విశ్లేషకుల అంచనా మాత్రం వేరేలా ఉంది. ఆసియాలో నానాటికీ పెరుగుతున్న భారతదేశం ప్రాబల్యాన్ని తగ్గించేదుకే తరచూ అమెరికా, పాకిస్తాన్‌కు ఇలాంటి సాయం చేస్తూ ఉంటుందంటున్నది వారి వాదన. అమెరికా అభిప్రాయం ఎలా ఉన్నా పాకిస్తాన్‌ నిజంగా ఈ సొమ్మును తీవ్రవాదులను నిర్మూలించేందుకు వాడుతుందా లేక వారిని మరింతగా పెంచి పోషించేందుకు ఉపయోగిస్తుందా అన్నది అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబుని ఊహించడం ఏమంత కష్టం కాదేమో!