పాక్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన అమెరికా..

 

పాకిస్థాన్ కు అమెరికా దిమ్మతిరిగే షాకిచ్చింది. ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తున్నట్టు ఎప్పటినుండో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి కూడా. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే తాను అధికారం చేపట్టిన దగ్గర నుండి పాక్ ను ఈ  విషయంపై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద నిరోధానికి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైన పాకిస్తాన్‌కు నిధులను నిలిపివేస్తున్నామని అమెరికా ప్రకటించింది.  పాకిస్తాన్‌కు అందించాల్సిన 50 మిలియన్ డాలర్ల(రూ. 322 కోట్లను)ను నిలిపివేస్తున్నామని పెంటగాన్ అధికారులు తెలిపారు. ఉగ్రవాద నిరోధానికి పాకిస్తాన్‌కు ఇదివరకే నిధులు ఇచ్చామని, కానీ ఫలితం దక్కలేదని, దేశంలోని ఉగ్రవాద సంస్థలను నిర్మూలించడంలో పాకిస్తాన్‌ విఫలమవ్వడంతో నిధులను నిలిపివేయాలని యూఎస్ స్టేట్ సెక్రటరీ జిమ్ మాటీస్ సూచించడంతో నిధులను నిలిపివేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. మరి దీనిపై పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి.