రేపటి నుంచే హైటెక్‌సిటీకి మెట్రో రైలు

 

సాఫ్ట్ వేరు ఉద్యోగులుకు గుడ్ న్యూస్. అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రో మార్గానికి ముహూర్తం ఖరారైంది. రేపటి నుంచి మెట్రో రైలు హైటెక్‌ సిటీకి కూడా పరుగులు పెట్టనుంది. అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రో మార్గానికి బుధవారం ఉదయం 9.15 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లో పచ్చజెండా ఊపనున్నారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా జరిగే ఈ కార్యక్రమంలో కొందరు ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొంటారని మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికులను సాయంత్రం 4 గంటల నుంచి అనుమతిస్తామని చెప్పారు.

అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రో మార్గం 10 కి.మీ దూరం. ఈ మార్గంలో మధురానగర్‌, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబరు-5, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గంచెరువు స్టేషన్లు ఉన్నాయి. వీటిలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్‌ మూడు స్టేషన్లను ఇప్పుడే ప్రారంభించడం లేదు. వీటి ప్రారంభానికి మరికొద్దివారాలు పడుతుందని మెట్రోరైలు అధికారులు తెలిపారు.
 
హైటెక్‌ సిటీ వరకు మెట్రో ప్రారంభం కానుండడంతో.. ఇప్పటికే 46 కిలోమీటర్లతో దేశంలోనే రెండో అతిపెద్ద కారిడార్‌గా నిలిచిన హైదరాబాద్‌ మెట్రోకు మరో 10 కిలోమీటర్లు జతకానుంది. అయితే, తొలి దశలో ప్రతిపాదించిన 72 కిలోమీటర్లలో మరో 15 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇందులో జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 9 కిలోమీటర్లు నిర్మాణంలో ఉండగా మరో 6 కిలోమీటర్లు పాతబస్తీ మార్గంలో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మార్గాన్ని ఈ ఏడాది చివరి కల్లా ప్రారంభించే దిశగా పనులు చురుగ్గా జరుగుతున్నాయి.