'అంబేద్కర్’కు మళ్లీ అవమానం
Published on: Sat Feb 11, 2012 9:14AM
తూ
ర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోనలో అంబేద్కర్ విగ్రహానికి మరోసారి అవమానం జరిగింది. విగ్రహానికి చెప్పుల దండవేసి ఉండటాన్ని శుక్రవారం ఉదయం కనుగొన్నారు. అయితే, కొద్ది గంటల వ్యవధిలోనే డాగ్‌స్క్వాడ్ సాయంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు స్థానిక దళితవాడకు చెందినవారే కావడం విచిత్రం. ఇటీవలి కాలంలో అంబేద్కర్ విగ్రహాలకు అవమానం ఘటనలతో జిల్లా అట్టుడుకుతున్న సంగతి విదితమే. తాజాగా కాట్రేనికోన తామరచెరువు సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి ఉండటాన్ని శుక్రవారం ఉదయం కొందరు గుర్తించారు. దీంతో దళితులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకినాడ, విజయవాడ నుంచి రప్పించిన పోలీసు జాగిలాలు రంగంలోకి దిగిన కొద్ది నిమిషాలకే అసలైన నిందితుల్ని పట్టుకున్నాయి. ఇద్దరే నిందితులుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అంబేద్కర్ విగ్రహాల్ని దళితులే అవమానించటంతో అప్పటివరకూ ఆందోళన నిర్వహించిన దళిత నాయకులు ఖంగుతిన్నారు. నిందితులు దళితులైనప్పటికీ వారిపై 153బి సెక్షన్‌ల కింద కేసులు పెట్టాలని, దోషులు ఎవరైనా వదలవద్దని కోనసీమ అంబేద్కర్ విగ్రహాల పరిరక్షణ సమితి అధ్యక్షులు జంగా బాబూరావు డిమాండ్ చేశారు.


