కమల వనంలో పచ్చ పుష్పాలు.. వేల కోట్లు కాజేశారు!!

 

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో అంబటి బుధవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదలు వచ్చింది మొదలు వరద వెళ్ళే వరకు రాష్ట్రంవైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. వరదల్లో ఇల్లు మునిగి పోతుందని తెలిసే బాబు హైదరాబాద్ పారిపోయారని ఆరోపించారు. నాగార్జునసాగర్ గేట్లు మూసేసిన తర్వాతనే విజయవాడకు తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. ఇవి కృత్రిమైన వరదలు అని, ఆయన ఇల్లు ముంచాలని ప్రయత్నం చేస్తున్నారు అని చంద్రబాబు సింపతీ పొందాలనే మాటలు మాట్లాడుతున్నారు అని అంబటి మండిపడ్డారు. గొంగట్లో తింటూ వెంట్రుకలు వచ్చాయన్నట్లుగా.. వరద ముప్పు ఉన్న అక్రమకట్టడమైన ఇంట్లో ఉంటూ నన్ను ముంచాలని ప్రభుత్వం చూసిందని చంద్రబాబు ఆరోపించడం సిగ్గుచేటు అని విమర్శించారు. నదీగర్భంలో ఉంటూ  ఇల్లు ముంచేశారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. పేపర్లలో రాయించుకుంటున్నారు. కృష్ణా నదికి వరదలు సృష్టించడం మానవులకు సాధ్యమవుతుందా అని అంబటి ప్రశ్నించారు. 'అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని టీడీపీ హయాంలో దేవినేని ఉమా ప్రకటించారు కదా. మరేమైంది. ఎన్ని కూల్చేశారు. ఏ అక్రమ కట్టడానికైతే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటీసులు ఇస్తామన్నారో.. ఇప్పుడు అదే ఇంట్లో చంద్రబాబు ఉన్నారు' అని అంబటి విమర్శించారు. 

అదేవిధంగా బీజేపీ నేత సీఎం రమేష్.. అమెరికాలో జ్యోతి ప్రజ్వలన చేయడానికి నిరాకరించి, జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని చేసిన వ్యాఖ్యలపై కూడా అంబటి స్పందించారు. "అమెరికాలో జ్యోతి ప్రజ్వలన చేయలేదని సీఎం జగన్‌ని హిందూ వ్యతిరేకి అంటున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మతం రంగు పులిమి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అమెరికాలో అగ్గి వెలిగించడం నేరం. అక్కడ ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా జ్యోతిని వెలిగిస్తారు. ఆయనా అదే చేశారు. కమల వనంలో చేరిన పచ్చ పుష్పాలు సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న పచ్చ కోవర్ట్." అని అంబటి విమర్శించారు.

ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ లు అయిన అసెంబ్లీ ఫర్నీచర్, రాజధానిపై బొత్స వ్యాఖ్యలు అంశాలపై కూడా అంబటి స్పందించారు. ‘అసెంబ్లీని దేవాలయంగా భావిస్తా. అక్కడ పూజారిగా మాత్రమే ఉన్నానంటున్న కోడెల చివరికి కొబ్బరి చిప్పలను కూడా ఎత్తుకుపోయారు. తన కుమారుడు, కుమార్తెను పూజారులుగా నియమించారు. వస్తువుల్ని దొంగిలించి దొరికిపోయిన తర్వాత.. వాటిని తిరిగి ఇచ్చేస్తున్నామంటున్నారు. కోడెల కుమారుడు, కుమార్తె ఇప్పటికే రాష్ట్రం విడిచి పారిపోయారని వార్తలొస్తున్నాయి’ అని అంబటి విమర్శించారు.

రాజధాని విషయంలో మంత్రి బొత్స వ్యాఖ్యల్ని తప్పుగా చిత్రీకరించారని అంబటి మండిపడ్డారు. ‘రాజధానిని అమరావతిలో కట్టొద్దని శివరామకృష్ణన్ చెప్పిన విషయాన్ని మాత్రమే బొత్స ప్రస్తావించారు. అంతేగాని రాజధానిని మార్చుతారని ఆయన ఎక్కడా చెప్పలేదు. అమరావతి, పోలవరంపై చేస్తున్న ప్రచారాలను నమ్మొద్దు. రాజధాని, పోలవరం, అన్న క్యాంటీన్‌లలో టీడీపీ నేతలు వేల కోట్ల రూపాయలు కాజేశారు’ అని అంబటి విమర్శలు గుప్పించారు.