TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మావిగన్.. జగన్ ప్రతిపాదనకు అంబటి భజన.. పెరుగుతోందట ప్రజాదరణ

Published on: Sat Apr 4, 2026 10:49AM

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ఖరారు చేస్తూ పార్లమెంట్ చట్ట సవరణకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో వైసీపీ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు  మావిగన్'  ప్రతిపాదనను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు.  ఈ ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వస్తున్నప్పటికీ, ఈ ప్రతిపాదన చేసిన జగన్ నెట్టింట ఓ ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయినప్పటకీ.. వైసీపీ సీనియర్ నాయకుడు, కోఆర్డినేటర్ సజ్జల, మాజీ మంత్రి  అంబటి రాంబాబు వంటి వారు మాత్రం మావిగన్ ను భుజాలకెత్తుకున్నారు.  వీరిలో అంబటి రాంబాబు ఒక అడుగు ముందుకు వేసి మావిగన్ కు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. 

అమరావతి నిర్మాణం అనేది ఎప్పటికీ పూర్తికాని ప్రక్రియ అని, అది ఒక కలగానే మిగిలిపోతుందని ఈ సందర్భంగా అంబటి వ్యాఖ్యానించారు.   పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే ఏమౌతుంది.. , భవిష్యత్తులో  మా ప్రభుత్వం వచ్చి మళ్లీ సవరణలు చేస్తుందంటూ తన వాచాలత్వాన్ని అంబటి ప్రదర్శించారు. అంబటి వ్యాఖ్యలపై ఒక రాజధాని అమరావతి ప్రాంతంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. 

మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో  వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్  ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.   అమరావతి రాజధానిగా స్థిరపడిందని మెజారిటీ ప్రజలు భావిస్తుంటే,  వైసీపీ మాత్రం రోజుకో మాట, పూటకో ప్రతిపాదనతో  ప్రతిష్ఠను మరింత దిగజార్చుకుంటోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

అమరావతికి వ్యతిరేకంగా ప్రజల వద్ద మాట్లాడడానికే ఇబ్బందిగా ఉందని క్యాడర్ ఓ వైపు నెత్తీనోరూ బాబుకుంటుంటే.. ఆ పార్టీ కోఆర్డినేటర్, జగన్ ప్రభుత్వ హయాంలో ముఖ్యసలహాదారు, సకలశాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి మావిగన్ ప్రతిపాదన ప్రతి పల్లెకూ చేరేలా ప్రచారం చేయాలంటూ పిలుపునివ్వడం చూస్తుంటే   జనం నుంచి వ్యక్తమౌతున్నఆగ్రహం, క్యాడర్ వ్యతిరేకత వైసీపీయులు చూడకుండా పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నచందంగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.