కోడెల మృతిపై డౌట్స్.. తెలంగాణ సర్కార్ కి వైసీపీ రిక్వెస్ట్

 

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసులు, వేధింపుల కారణంగా కోడెల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. అయితే కొందరు మాత్రం కోడెల మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

కోడెల మృతిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందిస్తూ..  కోడెల మృతి చాలా బాధాకరమని, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు. అయితే కోడెలది అనుమానాస్పద మృతిలా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కోడెల మృతిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయని, ఆత్మహత్య అని కొందరు, గుండెపోటు అని మరికొందరు అంటున్నారని అన్నారు. కోడెలది వివాదాస్పద మరణంలా కనిపిస్తోందని, దీనిపై తక్షణమే తెలంగాణ సర్కార్ సమగ్ర విచారణ జరిపించాలని అంబటి కోరారు.

మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోడెల కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా లేక ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా అన్నది తేలాల్సి ఉందని బొత్స అన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బొత్స కోరారు. ఆయన మరణంపై రకరకాల వార్తలు వస్తున్నాయని బొత్స తెలిపారు. సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని కోరారు. కోడెలది ముందు గుండెపోటన్నారని, ఆ తరువాత ఆత్మహత్య అంటున్నారని బొత్స అన్నారు. కోడెలను నిమ్స్‌ ఆస్పత్రి లేదా కేర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లారని బొత్స తెలిపారు.