TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘ఆసరా’ పేరుతో పథకమా?.. ‘గడపగడపకూ’లో అంబటి అజ్ణానం

Published on: Fri May 13, 2022 6:32AM

జగన్ ఆదేశంలో వైసీపీ నేతలు అయిష్టంగానైనా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం కొందరు మంత్రుల అజ్ణానం బయటపడి ప్రభుత్వం మరింత అభాసు పాలౌతోంది. అసలే గడప గడపలో ఎదురౌతున్న నిరసనలతో ప్రతిష్ట మసకబార్చుకున్నజగన్ సర్కార్...ఈ కార్యక్రమంలో మంత్రుల అజ్ణానం బట్టబయలై పరువు మంటగలుపుకుంటోంది. విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడే అంబటి రాంబాబుకు ప్రభుత్వ పథకాలపై ఇసుమంతైనా అవగాహన లేదని ఈ కార్యక్రమం సాక్షిగా బట్టబయలైపోయింది. గడప గడపకూ వైసీపీ అంటూ చేపట్టతలచిన కార్యక్రమాన్ని ప్రజాగ్రహం భయంతో గడప గడపకూ ప్రభుత్వంగా మార్చినా కూడా ప్రజాగ్రహ సెగ వైసీపీ నేతలకు తగులుతూనే ఉంది. అధికారులను వెంటబెట్టుకుని వెళ్లినా జనం నీలదీతతో బెంబేలెత్తే పరిస్థితి ఉందని మంత్రులూ, ఎమ్మెల్యేలే వాపోతున్నారు. అంబటి రాంబాబు నిర్వాకంతో జగన్ సర్కార్ లో మంత్రులకు ప్రభుత్వ కార్యక్రమాలపై ఇసుమంతైనా అవగాహన లేదని తేటతెల్లమైపోయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగాలలో తడబాటు, తప్పులతో నవ్వుల పాలౌతుండగా... యథారాజా తథా ప్రజా అన్నట్లుగా అంబటి కూడా ప్రభుత్వ పథకాలపై తన అవగాహనా లేమిని గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం సాక్షిగా చాటుకున్నారు. మాటల తూటాలతో విపక్షంపై విమర్శలతో విరుచుకు పడటంలో ముందుంటానని చెప్పుకునే తాజా మంత్రి అంబటి రాంబాబు, అవగాహనా లేమిలోనూ, అజ్ణానంలోనూ కూడా తానే ముందని నిరూపించుకున్నారు.పల్పాడు జిల్లా గోళ్లపాడు గ్రామంలో జరిగిన ‘గడపగడపకూ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటికి ప్రజలు సమస్యలు ఏకరవు పెట్టారు. మూడేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వానికి ఎన్నికల ముందు తాము గుర్తొచ్చామా అని నిలదీశారు.ఆసరా పథకం అందడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి కంగుతిన్నారు. ఆసరా ఏమిటి?.. ఆ పేరుతో పథకం ఉందా? అని ఆశ్చర్యపోయారు. ఇదే విషయాన్ని పక్కనే ఉన్న వాలంటీర్ ను అడిగి తెలుసుకున్నారు. దీంతో మంత్రి అంబటి అవగాహనా రాహిత్యం బట్టబయలైంది. మంత్రి వాలంటీర్ ను ఆసరా గురించి అడుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో క్షణాల్లో వైరల్ అయిపోయాయి. సొంత ప్రభుత్వ పథకాల గురించే అవగాహన లేని మంత్రి అంబటికి తాను నిర్వహిస్తున్న శాఖ ఏమిటన్నదైనా తెలుసా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కనీసం పోలవరంపైనైనా అవగాహన ఉందా అంటు ప్రశ్నిస్తున్నారు.