వామ్మో వాజే.. అంబానీ కేసులో సంచలనాలు

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన, మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న ముకేష్ అంబానీకి బెదిరింపుల కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రాజకీయ పెద్దలకు ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో  ఎన్ఐఏ విచారించే కొద్ది షాకింగ్ అంశాలు బయటకు వస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సచిన్‌ వాజే  ఎన్‌ఐఏకు రాసిన నాలుగు పేజీల సంచలనం సృష్టించింది. లేఖలో అనిల్‌ దేశ్‌ముఖ్‌తో సహా, అనిల్‌ పరాబ్‌(శివసేన), అజిత్ పవార్‌ కీలక సహాయకుడి పేర్లను ప్రస్తావించాడు సచిన్ వాజే. తనకు పోస్టింగ్‌ ఇచ్చేందుకు రూ.2 కోట్లు కోరడంతో పాటు.. ఇతర వసూళ్లకు పురమాయించారన్నది ఈ లేఖ సారాంశం. ఇవన్నీ అప్పటి సీపీ పరంబీర్‌కు సింగ్‌కు కూడా తెలుసని వాజే చెప్పారు. వాజే లేఖ మహారాష్ట్ర సర్కార్ లో కలకలం రేపుతోంది. 

సచిన్‌ వాజే నియామకం తొలి నుంచీ రాజకీయ రంగు పులుముకొంది. కరోనా సమయంలో పోలీసు బలగాలు అవసరం కావడంతో సస్పెన్షన్‌లో ఉన్నవారిని విధుల్లోకి తీసుకోవాలనే నిర్ణయం వాజేకు కలిసొచ్చింది. వాజేను తీసుకోవడంలో నాటి సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌ పాత్ర చాలా ఉంది. ఘాట్కోపర్‌ పేలుళ్ల కేసులో అనుమానితుడు ఖ్వాజా యూనిస్‌ లాకప్‌ డెత్‌ కేసులో వాజే 2004లో సస్పెండ్‌ అయ్యాడు.  అతడిని మళ్లీ 2020లో విధుల్లోకి తీసుకోవడంపై ఖ్వాజా కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కానీ  పోలీసులు తమ నిర్ణయాన్ని సమర్థించుకొని వాజేకు పోస్టింగ్‌ కొనసాగించారు. లోకల్‌ ఆర్మ్స్‌ యూనిట్‌లో పోస్టింగ్‌తో తిరిగి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో అడుగుపెట్టిన వాజేను కొన్ని రోజుల్లోనే కీలకమైన క్రిమినల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు మార్చేశారు. 

సీపీ అండతో సచిన్ కు పోస్టింగ్ 

సచిన్ వాజే నియామకాన్ని అప్పటి క్రైమ్‌ విభాగానికి చెందిన జాయింట్‌ సీపీ మిలింద్‌ బరాంబే  వ్యతిరేకించినట్లు.. ముంబయి పోలీస్‌ కమిషన్‌ హేమంత్‌ నగ్రాలే సమర్పించిన నివేదికలో ఉన్నట్లు పలు ఆంగ్ల పత్రికల్లో  కథనాలు వెలువడ్డాయి. సచిన్‌ వాజేను కేవలం నాటి సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌ మౌఖిక ఆదేశాలతోనే క్రిమినల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు అధిపతిని చేసినట్లు తేలింది. వాస్తవానికి ఈ విభాగానికి ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ అధికారి నాయకత్వం వహించాలి. కానీ, వాజే అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ మాత్రమే.  ఈ అంశాలన్నీ ముంబయి పోలీస్‌ విభాగంలో డొల్లతనాన్ని తెలియజేస్తున్నాయి.  

పరమ్ బీర్ అండదండలతో పోస్టులోకి వచ్చిన సచిన్‌ వాజే ఇష్టారాజ్యాంగా వ్యవహరించారని తెలుస్తోంది. తన పై అధికారులను ఎవరినీ పట్టించుకోకుండా  సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌కు మాత్రమే అతను రిపోర్టు చేసినట్లు తేలింది. క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు టాటాసుమో, ఇన్నోవా, స్కార్పియో వాహనాలు ఉన్నాయి. కానీ, సచిన్‌ వాజే మాత్రం ఆఫీస్‌కు మెర్సెడెస్‌ బెంజ్‌, ఆడీ వంటి విలాసవంతంమైన కార్లలో వచ్చేవాడు. తాజాగా అంబానీ ఇంటి వద్ద ఉంచిన స్కార్పియోను కూడా చివరి వరకు తన కార్యాలయంలోనే ఓ మూల ఉంచినట్లు తేలింది. ఆఫీస్‌కు చెందిన ఇన్నోవానే బాంబు అమర్చే సమయంలో కూడా వినియోగించాడంటే.. సచిన్ వాజే ఎంత ధైర్యంగా ఉన్నాడో ఊహించవచ్చు. 

సచిన్ వాజే లగ్జరీ లైఫ్ 

సచిన్‌ వాజే వాడిన లగ్జరీ కార్లను చూసి ఎన్‌ఐఏ అధికారులే అవాక్కయ్యారు.  మూడు బెంజి స్పోర్ట్స్‌ కార్లు, ఒక వోల్వో, ఒక టయోటా ప్రాడో, ఒక మిత్సింబిషి ఔట్‌ ల్యాండర్‌, ఒక ఆడీ, ఒక స్కోడా కారును అధికారులు స్వాధీనం చేసుకొన్నాయి. ఇవి కాకుండా ఒక స్కార్పియో, ఇన్నోవా, మారుతీఎకో వాహనాలను కూడా సీజ్‌ చేశాయి. వాజేకు సహకరించిన ఓ మహిళ వద్ద నుంచి రూ.7లక్షలు విలువైన బైక్‌ను కూడా స్వాధీనం చేసుకొన్నారు. దీనిని విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్నారు. అంతేకాదు వాజే బస చేయడానికి ఓ ఐదు నక్షత్రాల హోటల్లో  ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా ఓ వ్యాపార వేత్త రూ.12లక్షలు చెల్లించి 100 రోజులపాటు గదిని బుక్‌ చేశాడు. ఈ హోటల్‌కు వచ్చిన సమయంలో వాజే తెచ్చిన బ్యాగుల నిండా డబ్బులు ఉన్నట్లు హోటల్‌ ఎక్స్‌రే యంత్రాల్లో స్పష్టంగా కనిపించిందని ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఒక అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌ హవా ఈ స్థాయిలో నడవడానికి రాజకీయ బంధాలే కారణమని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.    

రాజకీయ నేతల్లో వణుకు

వాజే వసూళ్ల కేసులో రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తుండటంతో నేతలంతా సైలెంట్ అయిపోయారు. మొదట ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా సచిన్‌ వాజేను సమర్థించినా.. బాంబు బెదిరింపుల కేసులో వాజే పాత్ర బయటపడ్డాక దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛను ఇచ్చారు.  ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఈ కేసులో కీలక విషయాలను బయటపెట్టి సర్కారుపై ఆరోపణలు చేయడం ఇరుకున పెట్టింది. ఇక తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముంబయి కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ను హోంగార్డ్స్‌ విభాగానికి బదిలీ చేయడంతో మరో కొత్త వివాదానికి బీజం పడింది. ఆ తర్వాత పరమ్‌బీర్‌ సింగ్‌ రాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ స్వయంగా వాజేను పిలిచి రూ.100 కోట్లు వసూలు చేయమన్నారంటూ అవినీతి ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు. ఈ లేఖలో పరమ్‌బీర్‌ సింగ్‌ ప్రస్తావించిన తేదీల్లో అనిల్‌ దేశ్‌ముఖ్‌ కరోనాతో బాధపడుతున్నారని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ స్వయంగా ప్రకటించారు. కానీ, ఆ తర్వాత అనిల్‌ దేశ్‌ముఖ్‌ పర్యటన వివరాలు, విలేకర్లతో మాట్లాడిన అంశాలు బయటకు రావడంతో  పవార్ కూడా మౌనం పాటించారు.