ఆంధ్రాలో తెలంగాణ జర్నలిస్టులకు పెద్దపీట... జగన్ సర్కారుపై ఏపీ ఎడిటర్స్ ఆగ్రహం

 

 

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పాత్ర మరువలేనిది. స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్టులు ఉద్యమంలో పాల్గొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు... తలలు పగిలేలా గాయపడ్డారు. చివరికి తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంతో పలువురు జర్నలిస్టులు ఊహించని లబ్ది పొందారు. వివిధ స్థాయిల్లో పదవులను అందుకున్నారు. కొందరైతే టీఆర్ఎస్ అండతో ఏకంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై చక్రం తిప్పుతున్నారు. 

అయితే, తెలంగాణ జర్నలిస్టులకు స్వరాష్ట్రంలోనే కాదు, విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లోనూ పెద్దపీటే దక్కుతోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు జగన్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ...వాళ్లనుకూల వ్యక్తులకు పెద్దపీట వేయడం సహజం... కానీ ఆంధ్రప్రదేశ్ లో అసలు జర్నలిస్టు దిగ్గజాలే లేనట్లుగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జర్నలిస్టులకు ఏపీలో పదవులు కట్టబెట్టడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. 

ఇప్పటికే, నల్గొండకు చెందిన విజయ్ కుమార్ రెడ్డి ని సమాచారశాఖ కమిషనర్ గా, అలాగే ఖమ్మానికి చెందిన కృష్ణమోహన్ ను కమ్యూనికేషన్స్ సలహాదారుగా, అదేవిధంగా జాతీయ మీడియా సలహాదారుగా వరంగల్ వాసి దేవులపల్లి అమర్ ను నియమించడమే కాకుండా, పీఆర్వో విభాగంలో అనేక మంది తెలంగాణ జర్నలిస్టులకు అవకాశం కల్పించిన జగన్ ప్రభుత్వం.... తాజాగా ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా ఖమ్మం వాసైన కె.రామచంద్రమూర్తిని నియమించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే, తెలంగాణవాదులకు, తెలంగాణ జర్నలిస్టులకు ఏపీలో పదవులు కట్టబెడుతున్న జగన్ సర్కారు తీరుపై ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. ముఖ్యంగా సాక్షిలో పనిచేసిన తెలంగాణ జర్నలిస్టులను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ పదవులు కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. ఏదేమైనా తెలంగాణ జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వంలో పెద్దపీట వేయడం... ఆంధ్రా జర్నలిస్టు సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ముందుముందు ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.