అమరావతి అప్పులు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు కాదు.. కేంద్రం క్లారిటీ
Published on: Tue Mar 11, 2025 2:07PM

అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇస్తున్న రుణాల విషయంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి కేంద్రం పార్లమెంటు వేదికగా ఫుల్ స్టాప్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పుల ఖాతాలోకి అమరావతి నిర్మాణం కోసం చేసే అప్పలు పవడని కుండబద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణాలు రాష్ట్ర ప్రభుత్వ అప్పులలో భాగం కాదని కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
అమరావతి నిర్మాణం కోసం చేసే అప్పులు వేరని వాటిని రాష్ట్ర అప్పుల జాబితాలో కలిపే ప్రశ్నే లేదని వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం కుండబద్దలు కొట్టినట్లు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. అమరావతికి ప్రపంచ స్థాయి సంస్థలు అప్పులు ఇస్తున్నాయనీ, వాటిని రాష్ట్ర సర్కార్ అప్పులలో జమ చేయడం లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంటు వేదికగా స్పష్టం చేశారు.
ఈ ఏడాది జనవరి నుంచి ప్రపంచ బ్యాంకు, ఫిబ్రవరి 10 నుంచి ఆసియా అభివృద్ది బ్యాంకు ఏపీ రాజధాని అమరావతికి నిధులు మంజూరు చేశాయనీ, అయితే ఇంకా విడుదల కాలేదని వివరించిన కేంద్ర మంత్రి అమరావతి మొత్తం వ్యయంలో 10 శాతం లేదా 1500 కోట్ల రూపాయలను ప్రత్యేక గ్రాంటుగా త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపారు.


