TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జై అమరావతి @ 800

Published on: Thu Feb 24, 2022 11:36AM

ఒక‌టి రెండు రోజులు కాదు.. వారం, నెల కూడా కాదు.. ఏడాది.. రెండేళ్లు కూడా కాదు.. అంత‌కుమించే. త‌గ్గేదేలే అంటూ అమ‌రావ‌తి రైతులు ఏకైక రాజ‌ధాని కోసం పోరాడుతూనే ఉన్నారు. జై అమ‌రావ‌తి నినాదాల‌తో హెరెత్తిస్తూనే ఉన్నారు. లాఠీచార్జిలు, కేసులు, కుట్ర‌లు వారిని అడ్డుకోలేక‌పోతున్నాయి. ఎండా, వానా.. ఆక‌లి, ద‌ప్పిక‌లు వారి ముంద‌రి కాళ్ల‌కు బంధం వేయ‌లేక‌పోతున్నాయి. వెక్కిరింతలు, ఎగ‌తాళిలు, అవ‌మానాల‌ను లెక్క‌చేయ‌ట్లేదు. మూడు రాజ‌ధానులు వ‌ద్దు.. అమ‌రావ‌తినే ముద్దు.. ఇక్క‌డి నుంచే పాల‌న జ‌ర‌గాలంటూ ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడిలా పంతం ప‌ట్టారు అమ‌రావ‌తి రైతులు, మ‌హిళ‌లు. బంగారం పండే భూముల ఇచ్చిన త‌మ నోట్లో మ‌ట్టికొట్టొద్దంటూ వేడుకున్నారు.. పోరాడుతున్నారు. అమ‌రావ‌తి పోరాటానికి భ‌య‌ప‌డ్డారో.. కోర్టులో నిల‌వ‌ద‌ని బెదిరారో తెలీదు కానీ, ప్ర‌స్తుతానికైతే మూడు రాజ‌ధానుల బిల్లును వెన‌క్కి తీసుకుంది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు. కానీ, ఇది తాత్కాలిక‌మేన‌ని.. ఒక అడుగు వెన‌క్కి వేసినా.. మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల‌పై ముందుకే వెళ‌తామంటూ చెప్ప‌డంతో అమ‌రావ‌తి రైతులు పోరుబాట కొన‌సాగిస్తూనే ఉన్నారు. అలా.. అమ‌రావ‌తి ఉద్య‌మం 800 రోజుల‌కు చేర‌డం చారిత్ర‌క ఘ‌ట్టం. 

ఈ సందర్భంగా అమ‌రావ‌తి రైతులు 24 గంటల సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఉదయం 9 గంటలకు మొదలైన ఈ ప్రజా దీక్ష మ‌ర్నాడు ఉదయం 9గంటల వరకు కొనసాగనుంది. రాజధాని పరిధిలోని వెలగపూడిలో చేపట్టిన దీక్షకు వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.  

రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతికి దిగజార్చిన ప్రభుత్వం అమరావతి భూములను అమ్ముతామంటే సహించేది లేదని రైతులు, మహిళలు హెచ్చరించారు. రాజధాని అభివృద్ధికి భూములను ఉపయోగించకుండా సంక్షేమం పేరిట పప్పూబెల్లాల్లా పంచుతామంటే అంగీకరించే ప్రసక్తే లేదని వారు తెలిపారు. మూడు రాజధానుల వాదం విడిచిపెట్టి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.   

అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందంటూ.. 800 రోజుల రాజధాని పోరాటానికి అభినందనలు తెలిపారు టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు. "మీ ఉద్యమానికి, పోరాటానికి టీడీపీ ఎప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద  కక్షను పెంచుకున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం. తన మూర్ఖపు వైఖరి తో రాష్ట్రం లో లక్షల కోట్ల సంపదను సృష్టించే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసిన జగన్ తప్పులను చరిత్ర ఎప్పటికీ క్షమించదు. రాజ‌ధాని ప్రాంతం స్మశానం అన్న వాళ్లే.. ఇప్పుడు అమరావతి భూముల‌ను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. రాజధాని విషయంలో నిలకడ లేని నిర్ణయాలు, ముందు చూపులేని ఆలోచనలతో వ్యవహరిస్తున్న వైసిపి ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికే శాపంలా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా మూడు ముక్కల రాజధాని ప్రతిపాదనలను పూర్తిగా పక్కన పెట్టి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి. దేశ చరిత్ర లో నిలిచి పోయేలా జరుగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి తెలుగుదేశం ఎల్లవేళలా అండగా నిలుస్తుంది." అని స్ప‌ష్టం చేశారు చంద్ర‌బాబు.