TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం.. అమ‌రావ‌తి రైతుల ఘ‌న విజ‌యం..

Published on: Thu Mar 3, 2022 10:37AM

న్యాయం ఆల‌స్య‌మైతుందేమో గానీ.. న్యాయం జ‌ర‌గ‌కుండా మాత్రం ఉండ‌దు. అదే మ‌న న్యాయ‌వ్య‌వ‌స్థ గొప్ప‌త‌నం. శాస‌న వ్య‌వ‌స్థ‌తో ఎంత‌గా ఆట‌లాడుకున్నా.. న్యాయం ముందు ఎంత‌టి పోటుగాడైనా త‌ల‌వంచాల్సిందే. అమ‌రావ‌తి విష‌యంలో ఇప్పుడు అదే జ‌రుగుతోంది. చేతిలో అధికారం ఉందిక‌దాని.. 153 మంది ఎమ్మెల్యేల బ‌లం చూసుకొని.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని అడ్డ‌గోలుగా ఆగంమాగం చేయాల‌ని చూసిన జ‌గ‌న్‌రెడ్డికి దిమ్మ‌తిరిగేలా.. హైకోర్టు గ‌ట్టి షాక్ ఇచ్చింది. మూడు రాజ‌ధానులంటూ ముడు ముక్క‌లాట‌కు చెక్ పెట్టింది. అమ‌రావ‌తినే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఏకైక రాజ‌ధాని అంటూ తీర్పు ఇచ్చింది. 

ఇదేమీ మామూలు తీర్పు కాదు. దేశంలోకే ది బెస్ట్ తీర్పుల్లో ఒక‌టిగా నిలిచిపోనుంది. కోట్లాది మంది ఆంధ్రుల స్వ‌ప్నం సాకారం అయ్యే దిశ‌గా మ‌లి అడుగు ప‌డింది. అమ‌రావ‌తి మాత్ర‌మే రాజ‌ధాని అని చెప్ప‌డ‌మే కాదు.. అమ‌రావ‌తి నిర్మాణాన్ని 6 నెల‌ల్లోగా క‌ట్టాల్సిందేన‌ని టైమ్ బౌండ్ పెట్ట‌డం మ‌రింత ఊర‌టనిచ్చే అంశం. జ‌గ‌న్‌రెడ్డికి నిద్ర ప‌ట్ట‌కుండా చేసే విష‌యం. ఆరు నెలల్లో ప్లాన్ పూర్తి చేయాలని.. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. అధికార బ‌లంతో రెండున్న‌రేళ్లుగా అమ‌రావ‌తితో ఆటాడుకుంటూ.. పైసా కూడా ఖ‌ర్చు చేయ‌కుండా టైమ్ పాస్ చేసిన జ‌గ‌న‌న్న‌.. ఇప్పుడు త‌ప్ప‌నిస‌రిగా అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి చేయాల్సిందే. అది కూడా ఆరు నెల‌ల్లోనే. అందుకే జ‌గ‌న్‌రెడ్డి చేసిన పాపం ఇన్నాళ్ల‌కు పండింద‌ని అమ‌రావ‌తి రైతులు పండుగ చేసుకుంటున్నారు. 

పాపం.. ఆ రైతుల‌ను ఎంత‌గా వేధించారు.. పాపం.. ఆ రైతుల‌ను ఎంత‌గా ఏడిపించారు.. ఎంద‌రు లాఠీ దెబ్బ‌లు తిన్నారు.. ఎంద‌రిపైనో కేసులు పెట్టారు.. కొంద‌రి ఉసురు కూడా పోసుకుందీ ప్ర‌భుత్వం. తిండీ తిప్ప‌లు లేకుండా.. ఎండా వానా అన‌కుండా.. దీక్ష‌లు, ధ‌ర్నాలు, ఉద్య‌మాలు, పాద‌యాత్ర‌ల‌తో 800 రోజుల‌కు పైగా పోరాడుతున్న అన్న‌దాత‌ల‌కు, రాజ‌ధాని రైతుల‌కు ఎట్ట‌కేళ‌కు ఊర‌ట ల‌భించింది. హైకోర్టు పుణ్యాన వారికి ఆస‌రా దొరికింది. బంగారు పంట‌లు పండే భూములు ఇవ్వ‌గా.. ఆ భూముల‌ను స్మ‌శానాలు మార్చి.. ఏమార్చిన ఘ‌నుడు జ‌గ‌న్‌రెడ్డి. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆ భూమి మ‌ళ్లీ బంగారంగా మార‌నుంది. రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదు హైకోర్టు తెలిపింది. ఆహా.. ఇది క‌దా తీర్పు.. ఇప్పుడు క‌దా మాకు అస‌లైన‌ న్యాయం జ‌రిగింద‌ని అమ‌రావ‌తి రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ భూముల‌ను బీడుగా మార్చి.. అప్పుల కోసం త‌న‌ఖా పెట్టుకుని.. త‌మ నోట్లో మ‌న్ను కొట్టిన జ‌గ‌న‌న్న‌కు హైకోర్టు త‌న తీర్పుతో.. బుద్ధి చెప్పింద‌ని.. గ‌డ్డి పెట్టింద‌ని.. సంబ‌రాలు చేసుకుంటున్నారు రాజ‌ధాని రైతులు. ఈ అమ‌రావ‌తి మాది.. ఆంధ్రులు అంద‌రిదీ.. ఏపీకి ఏకైక రాజ‌ధాని.. అంటూ స‌గ‌ర్వంగా.. గుండెల నిండుగా.. కళ్ల‌ల్లో ఆనంద బాష్పాల‌తో.. గొంతెత్తి నిన‌దిస్తున్నారు. తాడేప‌ల్లి ప్యాలెస్‌కు వినిపించేలా.. జై అమ‌రావ‌తి.. జైజై అమ‌రావ‌తి.. అంటూ పండుగ చేసుకుంటున్నారు రాజ‌ధాని రైతులు.