హైకోర్టుకు రైతుల సాష్టాంగ నమస్కారం.. రాజధాని గ్రామాల్లో పండగ వాతావరణం
Published on: Thu Mar 3, 2022 11:55AM
ఎవరి మీదా నమ్మకం లేదు. పాలకుల మీద అసలే లేదు. జగనన్న చేసిన అన్యాయంకు ఆగమాగం అయ్యారు. అమరావతి కోసం బంగారం లాంటి భూములిచ్చి.. ఎటూ కాకుండా మిగిలిపోయారు. అయినా, నమ్మకం వీడలేదు. ధైర్యం సడలలేదు. తమవంతుగా 800 రోజులకు పైగా పోరాడుతున్నారు. రకరకాల రీతుల్లో ఉద్యమిస్తున్నారు. అమరావతి కోసం ఉద్యమ పోరాటంతో పాటు న్యాయ పోరాటం సైతం చేశారు. ఇప్పుడు ఆ న్యాయస్థానంలో రాజధాని రైతులకు ఘన విజయం వరించింది. జగన్‌రెడ్డికి దిమ్మతిరిగి.. మైండ్ బ్లాంక్ అయ్యే.. తీర్పు వచ్చింది.
రాజధాని రైతుల్లో ఆనందం. మదిలో ఉద్వేగం. గుండెల నిండా సంతోషం. వాళ్ల కళ్లల్లో ఆనంద బాష్పాలు. ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఆవిష్కృతమైంది. హైకోర్టు ధర్మాసనం తీర్పుతో అమరావతి రైతులు నిలువెల్లా పులకించిపోయారు. ఏపీ హైకోర్టుకు మనసారా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
రాజధాని అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అమరావతి పరిసర ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని పరిధిలోని గ్రామాల్లోని దీక్షా శిబిరాల వద్ద పెద్ద ఎత్తున రైతులు, మహిళలు సంబరాలు జరుపుకొంటున్నారు. తుళ్లూరు, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, మందడం తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు పరస్పరం మిఠాయిలు పంచుకుంటున్నారు.
హైకోర్టు దగ్గర పలువురు రైతులు సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ అభివృద్ధి చేయాలని కోరారు.


