TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

త‌గ్గేదేలే.. సీఆర్డీఏ, రేరాకు అమ‌రావ‌తి రైతుల నోటీసులు.. జ‌గ‌న‌న్న‌కు ఝ‌ల‌క్‌!

Published on: Mon Mar 21, 2022 1:02PM

అమ‌రావ‌తి రైతులు దూకుడు పెంచారు. ఇన్నాళ్లూ ఉద్య‌మాలు, పాద‌యాత్ర‌ల‌కే ప‌రిమిత‌మైన రాజ‌ధాని ప్ర‌జ‌లు.. ఇప్పుడిక వైసీపీ స‌ర్కారుపై ఎదురుదాడికి రెడీ అవుతున్నారు. హైకోర్టు తీర్పుతో.. రెట్టించిన ఉత్సాహంతో.. త‌గ్గేదేలే అంటూ జ‌గ‌న్‌రెడ్డికి ఝ‌ల‌క్ ఇస్తున్నారు. తాజాగా, రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ), స్థిరాస్తి నియంత్రణ సంస్థ (రెరా)కు అమరావతి రాజధాని రైతులు నోటీసులు ఇచ్చారు. నిర్ణీత గడువులోగా తమ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వనందుకు, జ‌రిగిన‌ ఆలస్యానికి న‌ష్ట‌ పరిహారం చెల్లించాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. గజానికి రూ.50, వాణిజ్య స్థలానికి రూ.75 చొప్పున ప‌రిహారం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. సమాధానం ఇవ్వకపోతే.. కోర్టుకెళ్తామని తేల్చి చెప్పారు. 

ఒప్పందం జరిగిన మూడేళ్లలోపు రాజధాని రైతులకు ప్లాట్లను అన్ని సౌకర్యలతో అప్పగించాలన్నది నిబంధన. టీడీపీ హ‌యాంలో అమ‌రావ‌తి ప‌నులు వేగంగా జ‌రిగినా.. జ‌గ‌న్ రాక‌తో అంతా తారుమారు. మూడు రాజ‌ధానులంటూ అమ‌రావ‌తిని ఆగ‌మాగం చేశారు. ప్లాట్ల డెవ‌ల‌ప్‌మెంట్ ఆపేశారు. ఒక్క ప‌ని కూడా ముందుకు సాగ‌లేదు. అలా అలా రెండేళ్ల త‌ర్వాత ఇటీవ‌ల హైకోర్టు తీర్పుతో మ‌ళ్లీ స‌ర్కారులో క‌ద‌లిక వ‌చ్చింది. అధికారులు హ‌డావుడి చేస్తున్నా.. వైసీపీ పెద్ద‌లు మాత్రం మూడు రాజ‌ధానుల విష‌యంలో వెన‌క‌డుగు లేదంటూ, త్వ‌ర‌లోనే అసెంబ్లీలో ఆ మేర‌కు బిల్లు పెడ‌తామంటూ మ‌ళ్లీ పాత పాటే పాడుతున్నారు. దీంతో, రాజ‌ధాని రైతులు సైతం వ్యూహం మార్చారు. న్యాయ‌స్థానంలో త‌మ‌కు త‌ప్ప‌క న్యాయం జ‌రుగుతుంద‌నే ధీమా ఉండ‌టంతో.. తాజాగా నోటీసుల‌కు జ‌గ‌న‌న్న‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు. 

గ‌త‌ ఒప్పందం ప్రకారం.. మూడేళ్ల గడువు ముగిసినా త‌మ‌కు ఇంకా ప్లాట్లు ఇవ్వనందున.. నష్టపరిహారం చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఇస్తే ఓకే. లేదంటే కోర్టుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని వార్నింగ్ ఇస్తున్నారు. అదే జ‌రిగితే.. సీఆర్డీఏకు చట్ట పరంగా ఇబ్బందులు తప్పక‌పోవ‌చ్చు. ఇక‌, సీఆర్డీఏపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన ఏపీ రెరా కు కూడా నోటీసులు ఇచ్చి.. మాగ్జిమ‌మ్ కార్న‌ర్ చేశారు. రిజిస్ట్రేష‌న్ల‌కు ఇంట్రెస్ట్ చూపిస్తున్న అధికారులు.. ప్లాట్ల అభివృద్ధి, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ముందుకు రాక‌పోవ‌డం.. హైకోర్టు తీర్పు త‌ర్వాత కూడా ఆశించిన మేర ప‌నులు జ‌ర‌గ‌క‌పోవ‌డం.. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ పెద్ద‌లు మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల బిల్లు అంటూ క‌న్ఫ్యూజ్ చేస్తుండ‌టంతో.. అమ‌రావ‌తి రైతులు సీఆర్డీఏ, రేరాకు నోటీసుల‌తో స‌ర్కారుకు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చార‌ని అంటున్నారు. రాజ‌ధాని రైతులు వైసీపీని కానీ, జ‌గ‌న్‌రెడ్డిని కానీ న‌మ్మే ప‌రిస్థితి లేదు. కేవ‌లం న్యాయ‌స్థానంపైనే వారి న‌మ్మ‌కం.. కోర్టే వారికి శ్రీరామ‌ర‌క్ష‌.