TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గ్లోబల్ క్యాపిటల్ అమరావతి.. చంద్రబాబు సింగపూర్ టూర్ లక్ష్యం అదేనా?

Published on: Mon Jun 15, 2026 10:19AM

ఆంధ్రప్రదేశ్  అభివృద్ధిలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. లోక్‌సభలో అమరావతికి శాశ్వత చట్టబద్ధమైన రాజధాని హోదా దక్కిన కొద్ది రోజుల వ్యవధిలోనే..  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ చారిత్రాత్మక విజయానికి క్షేత్రస్థాయిలో  అభివృద్ధికి మెరుగులు దిద్దేందుకు నడుంబిగించారు. ముఖ్యంగా రాజధాని అమరావతిని గ్లోబల్ క్యాపిటల్ స్థాయికి చేర్చేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. అంతే కాకుండా వాటిని అమలు చేయడానికి రంగంలోకి దిగారు.  

ఆయన తాజా సింగపూర్ పర్యటన లక్ష్యం అదేనని విశ్వసనీయగా తెలుస్తోంది.  అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం..  భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను  ఆకర్షించడం, అలాగే  గ్లోబల్ ఫండింగ్ పూల్స్ ద్వారా నిధులను సమీకరించడమే ఈ పర్యటన లక్ష్యంగా తెలుస్తోంది. 

ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు  మంత్రి పి. నారాయణ, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్డీయే  ఉన్నతాధికారులతో కూడిన బృందం ఉంది. అమరావతి నిర్మాణ వేగాన్ని పెంచడానికి,  ప్రపంచ స్థాయి మౌలిక వసతులను తీసుకురావడానికి ఈ పర్యటన  కీలకంగా చెబుతున్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్,  అక్కడి సీనియర్ క్యాబినెట్ మంత్రులతో చంద్రబాబు నేరుగా చర్చలు జరపనున్నారు. ఈ ప్రభుత్వాల మధ్య ప్రత్యక్ష సహకారం అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అమరావతి భవిష్యత్తుకు ఒక బలమైన పునాది కానుందని ఆయన విశ్వసిస్తున్నారు.

కార్పొరేట్ రంగంలో గ్లోబల్ లీడర్లతో పెట్టుబడుల వేట కూడా చంద్రబాబు పర్యటన లక్ష్యంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  జిఐసి  ఎగ్జిక్యూటివ్ కమిటీ సలహాదారు లిమ్ సియాంగ్ గువాన్, వైసిహెచ్ ( గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్, గూగుల్ క్లౌడ్ ఆసియా, పసిఫిక్ ప్రెసిడెంట్ కరణ్ బజ్వా వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో సీఎం భేటీలు ఈ లక్ష్యంలో భాగంగానే చెబుతున్నారు. అలాగే..  గతంలోనే అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వామిగా ఉన్న ప్రముఖ సంస్థ  సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో కూడా చంద్రబాబు  మౌలిక వసతుల టైమ్‌లైన్‌ను పునఃసమీక్షించనున్నారు.

ప్రపంచ నగరాల సదస్సు,  సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదికలపై ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల స్వర్గధామంగా చంద్రబాబు ప్రెసెంట్ చేసి,   అమరావతి మెగా డెవలప్‌మెంట్‌కు పూర్తిగా సిద్ధంగా ఉందనే బలమైన సంకేతాన్ని ప్రపంచ మార్కెట్‌కు పంపడమే ఆయన సింగపూర్ పర్యటన ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.