TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి రాజధానిపై జగన్ విచిత్ర వాదన.. ప్లేస్ మర్చాలంట

Published on: Fri May 23, 2025 4:26PM

 

ఏపీ మాజీ సీఎం  జగన్  చాలాకాలం తర్వాత అమరావతి రాజధానిపై విచిత్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ స్కామ్ చేస్తుందని పాత ఆరోపణలే  తిరిగి గుప్పించారు.  అల్రెడీ గతంలో మొదలు పెట్టిన పనులు పూర్తి చేయడానికని, నిర్మాణ వ్యయం పెంచేస్తూ ఎడాపెడా అప్పులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.  అమరావతిని ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాంతంలో కాకుండా బెజవాడ, గుంటూరుల మధ్య నిర్మించాలని సూచనలు కూడా చేస్తున్నారు. అయితే ఆయన నోటి వెంట మూడు రాజధానుల ప్రపోజల్ మాత్రం రావడం లేదు.  వైసీపీ  అమరావతి ప్రాంతంలో పూర్తిగా బలహీన పడిందనేది 2024 ఎన్నికల్లో నిరూపితమైంది. ఏకంగా 151 ఒక సీట్లతో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ,  మూడు రాజధానుల బిల్లును తెరపైకి తీసుకువచ్చి  రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బొక్కబోర్లా పడింది. 

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ  వైజాగ్‌లో చేసిన హడావిడి వర్కౌట్ కాలేదు. వైజాగ్‌ సిటీలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇక అమరావతిలో అయితే  జగన్ రాజధానికి వ్యతిరేకమనే భావన బలంగా పాతుకు పోయింది. రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. ఆ ఉద్యమం సుదీర్ఘంగా సాగినా అప్పటి వైసీపీ ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నాలు చేసి రైతుల్లో మరింత వ్యతిరేకత పెంచుకుంది. వాళ్ళని డీల్ చేసే విధానంలో జగన్ ప్రభుత్వం ప్రదర్శించిన దూకుడుతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతైంది. రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి ప్రజలు జగన్‌ని ఒక శత్రువుగా భావిస్తున్నారు. 

దాంతో గత పది నెలల కాలంగా  రాజధాని ప్రాంతానికి చెందిన వైసిపి నేతలే కాకుండా మొత్తం పార్టీ నాయకులు కూడా అమరావతిపై సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. ఎన్నికల జరిగి ఏడాది అయిపోవడంతో నెమ్మదిగా మళ్లీ రాజధాని ప్రాంతంలో ఉనికి చాటుకోవడం కోసం వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో అధునాతన  ప్యాలెస్ కట్టుకున్న జగన్.. మళ్లీ అమరావతి నిర్మాణ వ్యయాలు పెంచేశారని, అక్రమాలకు తెర లేపుతున్నారని బురద జల్లే ప్రయత్నాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.తాజా ప్రెస్ మీట్ లో జగన్ రాజధానిని  నాగార్జున యూనివర్సిటీ భూముల్లోనో, లేక విజయవాడ - గుంటూరుల మధ్య  ఒక 500 ఎకరాల్లోనో కట్టుకోవాలని సూచించారు. ఇక అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఐకానిక్ టవర్స్‌పై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. అమరావతిలో కొలువుదీరే ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. 

సమీకృత రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల ఆఫీసులు ఇందులో ఉంటాయి. మొత్తం 5 టవర్లను గతంలో మాదిరే ఈసారి కూడా మూడు ప్యాకేజీల కింద విభజించారు. రూ. 46 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బిడ్లు ఆహ్వానించారు. ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2,703 కోట్లతో టెండర్లను పిలిచారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల వైఖరి కారణంగా ఇప్పుడు అంచనా వ్యయం 73 శాతం పెరిగింటున్నారు.  అయితే ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన ఐకానిక్ టవర్స్ నిర్మాణ వ్యయం పెరగడంపై జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణాలు తిరిగి ప్రారంభమవుతున్న తరుణంలో మాజీ సీఎం ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్న చోట ల్యాండ్ రేటు  ఎంత ఖరీదైందో చెప్తున్నారు. అక్కడ పెడుతున్న ఖర్చుతో హైదరాబాద్, బెంగళూరుల్లో 5 స్టార్ వసతులతో అద్భుతమైన భవంతులు కట్టుకోవచ్చని విచిత్రమైన లెక్కలు చెప్పడం మొదలు పెట్టారు.

అమరావతి రాజధాని పున:నిర్మాణ పనులను ప్రధాని మోడీ ప్రారంభించడం...మూడేళ్ళలో అమరావతి రాజధాని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన తర్వాత కూడా వైసీపీ నేతలు తీరు చూస్తే వారి విధానం మారలేదని స్పష్టమవుతోంది. అప్పులు తెచ్చి అమరావతి కోసం పెడితే మిగిలిన ప్రాంతాల సంగతేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అమరావతికి కృష్ణా నది ముంపు ప్రమాదం పొంచి ఉందని తిరిగి ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా జగన్ ప్రెస్‌మీట్‌తో ఆయన అమరావతికి ఎంత వ్యతిరేకో స్పష్టమవుతుందని అంటున్నారు.  అలాగే  క్లియర్‌గా జగన్ మిస్ అయిన ఒక పాయింట్‌ని లేవనెత్తుతున్నారు. అంత సులభంగా ఏపీ రాజధానిని  యూనివర్సిటీ భూముల్లోనో.. లేక విజయవాడ గుంటూరు మధ్య 500 ఎకరాల భూముల్లో నిర్మించే అవకాశం ఉన్నప్పుడు తమ ప్రభుత్వ హయాంలో  జగన్  మూడు రాజధానుల ప్రహసనానికి ఎందుకు తెర లేపారని ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఆయన ఇప్పుడు చేస్తున్న సూచనలు అప్పుడే అమలు చేసి ఉంటే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయే పరిస్థితి  వచ్చేది కాదని యద్దేవా చేస్తున్నారు.