ఆంధ్రుల భవిత కోసం అలుపెరగని పోరాటం. అమరావతి రైతులకు వందనం!

కురుక్షేత్రం జరిగింది 5 ఊళ్ళ కోసం కాదు, దుష్ట శిక్షణ కోసం. అమరావతి పోరాటం 29 ఊళ్ళ కోసం కాదు, 5 కోట్ల ఆంధ్రుల భవిత కోసం. ఇది అమరావతి రైతులు, మహిళల నినాదం. ఇదే నినాదం సోషల్ మీడియాలో హోరెత్తింది. మహాభారతం స్పూర్తితో 3 వందల రోజులుగా అలు పెరగని పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు ఆంధ్రా జనం జై కొట్టారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిత కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పోరాటయోధులకు 
వందనాలు అంటూ కిర్తించారు. 

 

అమరావతి రాజధాని రైతుల ఉద్యమజ్వాల మూడొందల రోజులుగా ప్రజ్వరిల్లుతూనే ఉంది. పది నెలలుగా అకుంఠిత దీక్షతో పోరాటం చేస్తున్నారు రైతులు, మహిళలు.  అధికారపక్షానికి చుక్కలు చూపిస్తున్నారు. 3 వేల ఎకరాల భూములను రాజధాని కోసం ఇస్తే.. ఇప్పుడు మూడు రాజధానులంటూ తమను రోడ్డున పడేస్తున్నారన్న ఆక్రోశం వారిని నిత్యం పోరుకు పురికొల్పుతోంది. అందుకే అవమానాలు, నిర్బంధాలు ఎదురైనా వారు లెక్క చేయలేదు. పోలీసుల లాఠీ దెబ్బలకు వెనుకాడలేదు. అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపినా జంకలేదు. కరోనా పడగ విప్పుతున్నా.. జాగ్రత్తలు తీసుకుంటూనే కదన రంగం వీడలేదు. 

 

నిరాహార దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, రహదారులపై బైఠాయింపు, అసెంబ్లీ ముట్టడి, మౌన ప్రదర్శనలు, ర్యాలీలు, ప్రార్థనలు, యాగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు, వేడుకోళ్లు... ఇలా అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తూనే ఉన్నారు.ఏకైక రాజధానిగా అమరావతి.. అనే లక్ష్యంతో ఉద్యమం హోరెత్తుతోంది. అమరావతి నుంచి ఢిల్లీ వరకు తమ ఉద్యమ నినాదాన్ని వినిపిస్తూనే ఉన్నారు  రాజధాని రైతులు.   

 

అమరావతి ఉద్యమం మొదలయ్యాకా ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించింది. రాజధాని గ్రామాల్లోకి  వేల సంఖ్యలో పోలీసు బలగాల్ని దించింది. దాదాపు గ్రామాలన్నింటినీ దిగ్బంధించింది. 144 సెక్షన్‌, పోలీసు చట్టంలోని 30 సెక్షన్లను ప్రయోగించి.. రైతులను భయాందోళనకు గురి చేసి ఉద్యమాన్ని కట్టడి చేయాలని చూసింది. 3 వేల మందికి పైగా అన్నదాతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపింది. రాజధాని మొదలైన నాటి నుండి 80మంది రైతులు మనస్థాపానికి గురి అయి చనిపోయారు. అయినా ఉద్యమం ఆపలేదు అమరావతి రైతులు. కొందరి గుండెలు అలసి ఆగిపోయినా... భూదేవి అంతటి ఓర్పుతో శాంతియుతంగా పోరాడుతున్నారు ఈ భూమి పుత్రులు. 

 

రాజధాని పరిరక్షణ ఉద్యమంలో  అతివలే ఆదిశక్తులయ్యారు.  మందడంలో నిరసన ర్యాలీ చేసినా, దుర్గమ్మకు మొక్కులు చెల్లించినా , అసెంబ్లీ ముట్టడైనా, జాతీయ రహదారి దిగ్బంధమైనా.. మహిళలే ముందుండి నడిచారు. పోలీసులు బూటు కాళ్లతో తన్నినా, లాఠీలతో కొట్టినా మౌనంగా భరించారు. శాంతియుతంగానే ఆందోళన కొనసాగిస్తున్నారు. అమరావతికి చెందిన మహిళా ప్రతినిధులు, వారి తరపున పోరాడుతున్న మహిళా నేతలు  ఢిల్లీ వెళ్లి... కేంద్ర మంత్రులను కలిసి తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు.   

 

అమరావతి రైతులు, మహిళల అలుపెరగని పోరాటానికి ఆంధ్ర జనం జైకొట్టింది. ఉద్యమానికి 300 రోజులు పూర్తైన సందర్భంగా వారికి సంఘీభావం తెలిపింది.  అమరావతి మహోద్యమం గురించి , రైతులు , మహిళామతల్లులు పడుతున్న కష్టాల గురించి దేశ ప్రజలకు , జాతీయ నాయకులకు సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు జనాలు. మన రాజధానిని మనం కాపాడుకుందామంటూ శపథం చేశారు. 

అమరావతి హ్యాష్ టాగ్  ట్విట్టర్ లో  ట్రెండింగ్ లో నిలిచింది. రాజధానికి మద్దతుగా ట్విట్టర్ లో భారీగా పోస్టులు పెట్టారు. ఇతర అమరావతి అభిమానుల ట్వీట్లను రీట్వీట్ చేశారు.   

 

జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించలేక మౌనంగా రోధిస్తున్న వారికి, అమరావతి మహిళల పోరాటం ఈ రాష్ట్రానికే స్పూర్తి అని కీర్తించారు. ఒక నియంతకు భయపడి వెనుకడుగు వేస్తున్నాం కానీ, తెగించి నిలబడతే, జగన్ అనే వాడు చాలా చిన్న వాడు అని చాటి చెప్పారు.. అమరావతి మహిళలు అంటూ ఆకాశానికెత్తారు. ఆ పోరాట స్పూర్తితోనే, ఇంత పెద్ద అధికార యంత్రాంగం చేతిలో ఉన్నా, 16 నెలలుగా అమరావతిని ఇంచ్ కూడా కదపలేక పోయాడని కొందరు పోస్టులు పెట్టారు. 

 

నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే స్థాయి నుంచి, నాకు రాజధాని లేదు అని చెప్పాల్సిన స్థాయికి దిగజారిపోయామని ఏపీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం కోసం, మన హక్కుల కోసం, అమరావతి మహిళలు, రైతుల పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని పోరాడదాం రండి అంటూ పిలుపిచ్చారు. రైతన్నల కోసం  5 కోట్ల ఆంధ్రుల  బిడ్డల భవిష్యత్ కోసం.. ఆంధ్ర బిడ్డల చిరునామా కోసం.. మన బిడ్డలు వలస బతుకులు కాకుండా కాపాడు కోవటం కోసం కలిసి రావాలని కోరారు. ఆంధ్రుడా ఆలోచించు. రాజధాని అమరావతి ఒక్కటే అని గుర్తించు అని నినదించారు.  గమ్యంలేని గమనం, ముగింపులేని ప్రయాణం ఇంకా ఎన్నాళ్లు ఎన్నేళ్లు ?.. రండి కదలిరండి. మన రాజధాని అమరావతిని కాపాడుకొందాం, అమరావతి రైతులకు తోడుగా రా కదలిరా అంటూ కొందరు పోస్టు చేశారు. 

 

రాజధాని కోసం భూమి త్యాగం చేసిన రైతులకు గత  ప్రభుత్వం కొత్త బట్టలు పెట్టి గౌరవం ఇచ్చింది ...ఇప్పుడు ప్రభుత్వం లాఠీ తో గౌరవం ఇచ్చిందని నెటిజన్లు ఆరోపించారు. 34,322 ఎకరాలను ప్రభుత్వం అడగగానే ఇచ్చేసిన తమ త్యాగానికి ఏనాడైనా అమరావతి రూపుదాల్చుతుందన్న నమ్మకం... ఆ నమ్మకంతోనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ఉద్యమకారులారా... విజయోస్తు అంటూ కీర్తించారు నెటిజన్లు, ఆంధ్ర ప్రజలు. 

 

రాజధాని ఉద్యమం 3 వందల రోజులు కావడంతో అమరావతి రైతులు కదం తొక్కారు. కరోనా భయం వెంటాడుతున్నా, వర్షం కురుస్తున్నా పోరు బాటలో ముందుకు సాగారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆకుపచ్చ కండువాలు ధరించి జాతీయ జెండాలు, అమరావతి జేఏసీ జెండాలతో నినదించారు. తుళ్లూరు నుంచి మందడం వరకు 9 కిలోమీటర్ల మేర వేల మంది రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకు పోరు ఆపబోమని స్పష్టం చేశారు. పరిరక్షణ సమితి ర్యాలీలో పాల్గొనేందుకు రాజధాని ప్రాంతంలోని ప్రతి పల్లె కదిలింది. గుంటూరు, మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడు, పెదకూరపాడు, పొన్నూరు, తెనాలి, వేమూరు, నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో  భారీగా నిరసనలు కొనసాగాయి. అమరావతికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు  జరిగాయి.