ఇంటిని గ్రంథాలయానికి ఇవ్వలేని చిరుకి రైతుల త్యాగం విలువేం తెలుస్తుంది!!

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోనని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనను.. మెగాస్టార్ చిరంజీవి స్వాగతించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీంతో మెగా అభిమానుల్లో గందరగోళం నెలకొంది. జగన్ నిర్ణయాన్ని చిరంజీవి సమర్ధించడం పట్ల ఎలా స్పందించాలో తెలియక మెగా అభిమానులు తలలుపట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే అమరావతి ప్రాంత రైతులు మాత్రం చిరంజీవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సాక్షిగానే రైతులు చిరంజీవి మీద విమర్శలు గుప్పిస్తున్నారు.

‘చిరంజీవి ఏ రోజూ ప్రజా సమస్యలపై స్పందించింది లేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి మూడు రాజధానులను ఎలా సమర్థిస్తారు?. మీ సినిమాలు చూడటానికి.. ఆడించుకోవటానికి జగన్‌ ని కలిశారు కానీ.. ఏనాడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదు’ అని ఓ రైతు వ్యాఖ్యానించాడు. ‘చిరంజీవికి వైజాగ్‌లో చాలా ఆస్తులున్నాయి. అందుకే మూడు రాజధానులు స్వాగతించారు.' అని ఓ రైతు ఆరోపించాడు. 'రైతుల గురించి మీకు తెలుసు కాబట్టి.. రైతులు పెట్టే అన్నమే మీరు తింటున్నారు కాబట్టి మాకు మద్దతివ్వండి. అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే.. ఏపీలో మీ సినిమాలు కూడా రిలీజ్ చేయనివ్వం.’ అని మరో రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో కూడా చిరంజీవిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైజాగ్‌లో స్టూడియో కోసమే చిరంజీవి మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంకా కొందరైతే పాత విషయాలను తవ్వితీసి మరీ.. చిరంజీవి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చిరంజీవి సొంత ఊళ్ళో నిరుపయోగంగా ఉన్న ఇంటిని గ్రంథాలయానికి ఇవ్వాలని ఆ ఊరి ప్రజలు కోరగా.. అప్పుడు చిరంజీవి ఇవ్వకుండా ఆ ఇంటిని డబ్బులకి అమ్ముకున్నారని అంటున్నారు. ప్రజాదరణతో సినిమాల్లో కోట్లు సంపాదించారు కానీ ఓ చిన్న ఇంటిని ఊరికోసం ఇవ్వలేకపోయారు. కానీ అమరావతి ప్రాంత రైతులు రాజధాని కోసం వేల ఎకరాల భూములు త్యాగం చేశారు. అలాంటి వారికి అండగా నిలవాల్సింది పోయి.. వారికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అండగా నిలబడతారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.